23న కిరణ్ రెడ్డి రాజీనామా: అసెంబ్లీ రద్దు?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జనవరి 23వ తేదీన రాజీనామా చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చను పూర్తి చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దీంతో 23వ తేదీన ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు.
తాను రాజీనామా చేయడంతో శాసనసభ రద్దుకు ఆయన సిఫార్సు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతారని ఇప్పటికీ ప్రచారం సాగుతూనే ఉంది. కానీ, అందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే, తాను రాజీనామా చేసి, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం ద్వారా సకాలంలో ఎన్నికలకు అవకాశం కల్పించడానికి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధపడినట్లు చెబుతున్నారు.

చాలా మంది సీమాంధ్ర శాసనసభ్యులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి దారిలో నడుస్తారని అంటున్నారు. దాంతో రాష్ట్రపతి పాలన విధించాల్సిన స్థితిని తీసుకు వస్తారని అంటున్నారు. దానివల్ల శాసనసభను సస్పెండ్ యానిమేషన్‌లో పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.
శాసనసభ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయవచ్చుననే ఉద్దేశంతో సకాలంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆ చర్యకు దిగాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దాదాపు 50 మంది సీమాంద్ర కాంగ్రెసు శాసనసభ్యులు, కొంత మంది మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, శాసనసభ రద్దుకు సిఫార్సు చేయడానికి కిరణ్ కుమా రెడ్డికి ఇబ్బందులు ఎదురు కావచ్చునని అంటున్నారు. అలా సిఫార్సు చేయాలంటే మంత్రి వర్గ ఆమోదం అవసరం. తెలంగాణ మంత్రులు అందుకు అంగీకరించకపోవచ్చు. మంత్రివర్గంలో ఓటింగ్ నిర్వహించడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి మెజారిటీ నిర్ణయం మేరకు శాసనసభ రద్దుకు సిఫార్సు చేయవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications