వేగంగా మారుతున్న సమీకరణాలు: 'థర్డ్ ఫ్రంట్'కు ఎస్పీ సై?, కేసీఆర్, మమతల స్కెచ్ ఇదీ..
హైదరాబాద్: అనూహ్యంగా 'థర్డ్ ఫ్రంట్' ఆలోచనతో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ చెప్పినట్లే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా 'థర్డ్ ఫ్రంట్' వ్యూహానికి తెర వెనుక కసరత్తులు చేస్తున్నారు. ఈ ఇద్దరి సమన్వయంతో త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఒక రూపం తీసుకోబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

థర్డ్ ఫ్రంట్ ఒక రూపం తీసుకుంటోంది:పీటీఐ
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఒక రూపం సంతరించుకుంటోందని 'పీటీఐ' స్పష్టం చేసింది. ఇందుకోసం మమతా బెనర్జీ సైతం పలు పార్టీల కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భవిష్యత్తు వ్యూహానికి సంబంధించి ప్రణాళికలు రచించడంలోనూ.. ప్రాంతీయ పార్టీలను ఏకతాటి పైకి తీసుకురావడంలో ప్రస్తుతం ఈ ఇద్దరూ బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎజెండా కోసం కేసీఆర్ ప్రణాళిక:
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటులో 'ఎజెండా' కీలక పాత్ర పోషించనుండటంతో కేసీఆర్ పక్కా ప్రణాళికతో అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం ఒక కార్యాచరణ కూడా సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేశవవ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, ఢిల్లీల్లో సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. వాళ్ల అనుభవాలను పరిగణలోకి తీసుకుని దేశాన్ని ప్రభావితం చేయగల విధాన పరమైన నిర్ణయాలను ఎజెండాలో చేర్చనున్నారు.

స్టాలిన్ తో మమత చర్చలు:
ఇక మరోవైపు మమతా బెనర్జీ పలు పార్టీల నేతలతో ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టారు. తమిళనాడులో డీఎంకే, బిహార్‌లో ఆర్జేడీ, ఒడిసాలో బీజేడీ తదితర పార్టీల నేతలతో ఆమె మాట్లాడారు.
కేసీఆర్‌తో చర్చల తర్వాత, డీఎంకే నేత స్టాలిన్‌తో ఆమె 12 నిమిషాల పాటు మాట్లాడినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల కోసం మనం ఐక్యం అయితే.. 75 ఎంపీ సీట్లు పక్కా అని ఆయనతో చెప్పినట్టు తెలుస్తోంది. తృణమూల్ నేత డెరిక్ ఒబ్రెయిన్ పార్లమెంటు లాబీల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

శివసేన కూడా, అద్భుతమన్న ములాయం:
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసేది లేదని ఇప్పటికే ప్రకటించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా మమత చర్చలు జరిపారు. అలాగే సమాజ్‌వాదీ వృద్ధ నేత ములాయం సింగ్ యాదవ్‌ను కూడా మమతా ఒప్పించినట్టు సమాచారం. 'కేసీఆర్, మీరు కలిసి చేసిన ఈ ఆలోచన అద్భుతం. సరైన సమయంలో సరైన నిర్ణయం' అంటూ ములాయం స్పందించినట్టు తృణమూల్ నేత చెప్పారు.

బీఎస్పీ కూడా, కలిసొచ్చేదే..:
జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బతీసేందుకు అటు బీఎస్పీ కూడా 'థర్డ్ ఫ్రంట్'తో చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీల మధ్య సఖ్యత కుదురుతుండటం 'థర్డ్ ఫ్రంట్'కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
గోరఖ్ పూర్, ఫల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థికి మాయావతి మద్దతు పలికారు. తమ లక్ష్యం బీజేపీ వ్యతిరేక పాలిటిక్స్ కాబట్టి అక్కడ అభ్యర్థిని పెట్టడం లేదన్నారు. ప్రతిఫలంగా రాజ్యసభకు నామినేట్ అవడం కోసం మాయావతి ఎస్పీ సహాయం కోరనున్నారు. తప ఒప్పందం ఉపఎన్నికలకే పరిమితం అని మాయావతి చెబుతున్నప్పటికీ.. 'థర్డ్ ఫ్రంట్' కార్యరూపం దాల్చితే సమీకరణాలు మారిపోయే అవకాశాలు లేకపోలేదు.

మమతా, కేసీఆర్ ప్లాన్:
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'దేశంలోని ప్రతి బీజేపీ అభ్యర్థికి పోటీగా ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఒకే ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టాలి. ఆ అభ్యర్థి తరఫున అన్ని పార్టీల నేతలూ ప్రచారం చేయాలి' అని మమత, కేసీఆర్ గట్టిగా నిర్ణయించినట్టు సమాచారం. వామపక్షాలను కలుపుకుని పోవడానికి కూడా తనకెలాంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications