బాబు వైపు జగన్ ఎమ్మెల్యేలు, భూమా ఉన్నారా?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
సీమాంధ్ర ప్రాంతం నుండి ఇరవై నుండి ఇరవై అయిదు మంది వరకు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారట. కర్నూలు జిల్లాలోని 14 ఎమ్మెల్యేల్లో టిడిపి 3, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 ఉన్నాయి. 11 మంది ఎమ్మెల్యేల్లో పలువురు టిడిపి వైపు చూస్తున్నారట.

సీమాంధ్రలో మొత్తంగా ఇరవై మందికి పైగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందులో భూమా నాగిరెడ్డి వంటి వారు కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే భూమా నాగిరెడ్డి.. వైయస్ జగన్‌ను వదిలి పెట్టరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభద్రతా భావం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అభధ్రతా భావం, జగన్ వైఖరి వల్ల ఇతరపార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడం, కేంద్రంలో చంద్రబాబు సన్నిహిత పార్టీ అధికారంలో ఉన్నందున.... కేసులో ఇరుక్కున్న జగన్ పరిస్థితి ఏమిటనే అభద్రతా భావం ఆ పార్టీలో ఉందని అంటున్నారు.
వైయస్ జగన్ కేవలం అభద్రతా భావంతోనే ఇటీవల కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ భవిష్యత్తు పైన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆందోళనతో ఉన్నారట. ముందే మరో సైకిల్ ఎక్కితే బాగుంటుందని భావిస్తున్నారట. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిజిస్టర్డ్ పార్టీయే తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కానందున వేటు పడే అవకాశాలు లేవని వారు అభిప్రాయపడుతున్నారట. తెలంగాణలోను గెలిచిన వారు తెరాస వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వారు ఆ ప్రచారాన్ని కొట్టి పారేశారు.












Click it and Unblock the Notifications