చంద్రబాబుకు మరో తలనొప్పి: ఎవరికి చాన్స్
హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవులను కోరుతున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. ఎవరిని ఎంపిక చేయాలనే విషయం ఆయనకు కష్టంగా మారే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తారని భావించారు.
గవర్నర్, స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా కింద 12 ఎమ్మెల్సీ పోస్టుల ఎంపిక జరగాల్సి ఉంది. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ మూడు ఎమ్మెల్సీ సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణకు అదనంగా మూడు వచ్చాయి. దీంతో ఈ విషయంపై స్పష్టత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 ఎమ్మెల్సీ సీట్లు వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్సీల సంఖ్య 50. ఎమ్మెల్సీ సీట్ల సంఖ్యను 50 నుంచి 58కి పెంచాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు. పొత్తులో భాగంగా బిజెపికి తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాల్సి ఉంది.
బిజెపికి 2015లో తాను హామీ ఇచ్చిన సీట్లను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఖాళీగా ఉన్న ఓ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించింది. కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామాతో ఆ సీటు ఖాళీ అయింది.
ఆ సీటుకు ఆగస్టు 21వ తేదీన ఎన్నిక జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. శాసనసభలో మెజారిటీ ఉండడంతో తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications