కేంద్ర కమిటీలో హరికృష్ణ: టిడిపిపై నారావారి పట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వారసత్వం కోసం జరిగిన పోరులో నందమూరి కుటుంబంపై నారా కుటుంబం ఆధిపత్యం సాధించింది. పార్టీపై పట్టు కోసం జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ సాగిస్తూ వస్తున్న పోరాటం ముగిసినట్లే. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన కమిటీ తీరును బట్టి అది స్పష్టమవుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తనయుడు నందమూరి హరికృష్ణను పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణకు పార్టీ కమిటీల్లో స్థానం లభించలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఊసు కూడా లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు చంద్రబాబు ఊహించిన విధంగానే ప్రమోషన్ ఇచ్చేశారు. నారా లోకేష్‌కు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య జరిగిన పోరులో చంద్రబాబు చాలా జాగ్రత్తగా పావులు కదిపారు. చివరకు పార్టీలో నారా లోకేష్ కీలకంగా మారారు.

హరికృష్ణకు పోలిట్ బ్యూరోలో ప్రాతినిధ్యం లభించింది. అయితే, నారా లోకేష్ పోలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నియమితులయ్యారు. అలాగే టిడిపి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. అలాగే, మొత్తం వ్యవహారంలో నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించినట్లే అయింది. బాలకృష్ణను పార్టీ కమిటీల్లోకి తీసుకోకపోవడం ద్వారా లోకేష్‌కు పోటీని నివారించారు.
అలాగే, తెలంగాణ పార్టీ కమిటీ నియామకంలో నారా లోకేష్ మాటే చెల్లుబాటు అయినట్లు కనిపిస్తోంది. ఎల్ రమణను తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే అదనంగా రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అంటే, రమణను నామమాత్రం చేస్తూ రేవంత్ రెడ్డి నియామకం జరిగిందని భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కమిటీకి అటువంటి వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి ఏదీ లేకపోవడాన్ని బట్టి కూడా తెలంగాణ పార్టీపై వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డికి పార్టీపై అధికారాన్ని ఇచ్చినట్లయింది. ఏమైనా, చంద్రబాబు నందమూరి వారుసల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications