వైఎస్ స్కీం కంటే బెస్ట్‌గా: లోకేష్ స్పీడ్, అమెరికాకు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ 2014 ఎన్నికలలో కీలక పాత్ర పోషించనున్నారు. 2009లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో లోకేష్ పాత్ర ఉన్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల కోసం టిడిపి మేనిఫెస్టో ప్రజాకర్షితంగా ఉండేందుకు లోకేష్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 7న అమెరికా వెళ్లనున్నారు.
అరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి కంటే మంచి పథకాన్ని రూపొందించి పార్టీ మేనిఫెస్టోలో పెట్టే దిశగా టిడిపి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పథకాల కంటే మంచి పథకాలపై అధ్యయనం చేసేందుకు లోకేష్ అమెరికా వెళ్తున్నారు. 2009లో కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి రావడానికి అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ప్రధాన కారణమైందంటారు.

అదే సమయంలో అమెరికాలోని ప్రవాసాంధ్రుల మద్దతును కూడా లోకేష్ కూడగట్టనున్నారట. ఇటీవల అనేకమంది ప్రవాసాంద్రులు చంద్రబాబును రమ్మని ఆహ్వానించిన నేపథ్యంలో లోకేశ్ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి తమ వంతు సాయం చేయాలని అనుకుంటున్నామని, అవసరమైతే నియోజకవర్గాల వారీగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారట.
ఎన్నికల తరుణంలో వారిని కలవడానికి చంద్రబాబు సుముఖంగా లేకపోవడంతో లోకేష్ ఆ వైపు కూడా దృష్టి సారించనున్నారంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాలు, జిల్లా వారిగా పార్టీ నాయకులతో భేటీ అవుతూ పార్టీపై పట్టు సాధిస్తున్న లోకేష్.. ఇప్పుడు మేనిఫెస్టో కోసం అమెరికా వెళ్లడం, ప్రవాసాంధ్రుల పైన దృష్టి సారించడం గమనార్హం.












Click it and Unblock the Notifications