ఎల్లలు దాటిన నయీం ఆగడాలు: బాధితుల్లో ఎన్నారైలు
హైదరాబాద్: ఎదురుకాల్పుల్లో హతమైన నయీముద్దీన్ ఆగడాలు ఎల్లలు దాటినట్లు భావిస్తున్నారు. అతని బాధితుల్లో ఎన్నారైలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అతను స్మగ్లింగులో కూడా పాలు పంచుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిట్ కంట్రోల్ రూంకు నయీమ్ బాధితుల ఫిర్యాదులు వెల్లువలా వస్తన్నాయి.
నయీం బాధితుల నుంచి ఫోన్లు కూడా దండిగానే వస్తన్నాయి. ఇప్పటికే వందకు పైగా ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నయీం బాధితుల్లో ఎన్నారైలు కూడా ఉన్నారు. విదేశాల నుం చి సోమవారం ఒకేరోజు సిట్ కంట్రోల్ రూంకు మూడు ఫోన్‌కాల్స్ వచ్చాయి.
కాగా, ఈ-మెయిల్ ద్వారా కూడా తాము పడ్డ బాధను, చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలను చేరవేస్తున్నారు. అమెరికాలో సంపాదించిన మొత్తంతో నల్లగొండలో వ్యాపారం చేసేందుకు వచ్చిన ఓ ఎన్నారైని బెదిరించి నయీం రూ.50 లక్షలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
పలు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని వాయిస్ రికార్డులను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న బ్యాంకు పాస్‌బుక్స్ ఖాతాల వివరాల కోసం బ్యాంకులకు లేఖలు రాయాలని భావిస్తున్నారు. దీంతో నయీంకు పెద్దమొత్తంలో డిపాజిట్ చేసినవారిని గుర్తించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

తనకేదైనా జరిగితే తనకు సహకరించిన ప్రముఖులను కూడా కేసుల్లో ఇరికించే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం, వారితో మీటింగ్‌లు, పార్టీలను వీడియో తీయించడం, ఫొటోలు దిగడం లాంటి ఆధారాలు సిద్ధం చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. నయీం డైరీలోని పేర్లు, వివరాలు ఇదే విషయా న్ని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏ6 సమీరుద్దీన్ అరెస్టు
గ్యాంగ్‌స్టర్ నయీం నయీం అనుచరుడు ఎండీ సమీరుద్దీన్ (26)ను హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నల్గొండకు వెళ్తుండగా ఎల్బీనగర్ బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నయీం కేసులో పోలీసులు 14 మందిని నిందితులుగా చేర్చారు. అందులో సమీరుద్దీన్ ఏ6గా ఉన్నాడు.
నయీం స్థావరాల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఖమ్మం వద్ద పట్టుబడిన నయీం డ్రైవర్ శామ్యూల్ నుంచి మరిన్ని డెన్‌ల వివరాలు రాబట్టినట్లు, నార్సింగి పరిసర ప్రాంతాల్లో మరో ఐదు ఇళ్లు ఉన్నట్లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications