తేల్చేసిన పవన్ కల్యాణ్: చంద్రబాబుతో ఇక వైరమే!
ఎపికి సంబంధించిన సమస్యల విషయంలో చంద్రబాబు పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారనే అపవాదును పవన్ కల్యాణ్ తుడిచిపెట్టేశారు. హోదాపై పోరులో ఆయన స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు.
విజయవాడ: బిజెపిపై తిరుగుబాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల పవన్ కల్యాణ్ మెతగ్గా వ్యవహరిస్తున్నట్లు ఇంత కాలం ప్రచారం సాగుతూ వచ్చింది. ఆ ప్రచారాలనుపవన్ కల్యాణ్ తాజా విమర్శలతో తిప్పికొట్టారు. చంద్రబాబుతో ఇక వైరమే కొనసాగుతుందనే సంకేతాలను ఆయన స్పష్టంగా పంపించారు. ప్రత్యేక హోదాపై పోరులో ఆయన చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.
తెలుగుదేశం పార్టీతో ఆయన పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లే భావించడానికి వీలైనంతగా ఆయన విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటుగా స్పందిస్తూ పవన్ కల్యాణ్ పట్ల కాస్తా మెతగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇక ఎంత కాలం ఆ వైఖరి కొనసాగడానికి వీలు లేని స్థాయికి పవన్ కల్యాన్ తన రాజకీయాలను నడిపిస్తున్నారు..
చంద్రబాబుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పట్ల శుత్రుపూరిత వైఖరి తీసుకుని తిప్పికొట్టడమే మంచిదనే వైఖరి కూడా టిడిపి నాయకులు కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడు ముక్కలాటగా సాగే అవకాశాలున్నాయి.

ఎంపీలను టార్గెట్ చేస్తూ, చంద్రబాబును మినహాయిస్తూ...
ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది ఎంపీలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తూ వచ్చారు. అయితే, తాజాగా చంద్రబాబుపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ తాను ఇక ఎంత మాత్రం మిత్రుడిని కాననే విషయాన్ని తేల్చి చెప్పారని అంటున్నారు. సుజనాచౌదరి, రాయపాటి వంటి వ్యాపారాలు చేసేవారిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్న తీరును తప్పు పడుతూ చంద్రబాబును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆయన గత కొద్దిరోజుల నుంచి రాయపాటిపై విమర్శలు సంధిస్తున్న విషయం తెలిసిందే.

ఆ వ్యాఖ్యలు వెంకయ్యతో దోస్తీ మీదనా...
ఏపిలో టిడిపి పాలన లేదని, మినీ బిజెపి పాలనలా మారిందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య కూడా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కలిసి పనిచేయడంపై ఆయన ఆ వ్యాఖ్యను సంధించారని భావిస్తున్నారు. చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేరని తేలిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ కోణంలో తన వ్యాఖ్యలను సంధించారని అంటున్నారు. బిజెపి, టిడిపి ఎపిలో కలిసి పనిచేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో తాను చంద్రబాబుతో కలిసి పనిచేయడం కుదరదనే అభిప్రాయానికి పవన్ కల్యాణ్ వచ్చినట్లు చెబుతున్నారు.

చంద్రబాబును ఇలా టార్గెట్ చేశారు...
సింగపూర్ ఆదర్శమనే చంద్రబాబు అక్కడ అవినీతికి పాల్పడిన తన అనుచరులను సింగపూర్ అధ్యక్షుడు శిక్షించినట్లే తన సహచరుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో చంద్రబాబు దాదాపుగా ఇరకాటంలో పడినట్లేనని చెబుతున్నారు.ఇప్పటివరకూ చంద్రబాబును తప్ప పార్టీ నేతలను మాత్రమే విమర్శిస్తూ వచ్చారు. కానీ, తాజాగా చంద్రబాబు తప్పుచేస్తున్నారని రెండున్నరేళ్ల తర్వాత విమర్శించడం, ఆయనకు పాలనానుభవం ఉన్నందుకే ఎన్నికల్లో మద్దతునిచ్చానని చెప్పడం, హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్న చంద్రబాబు, ఇప్పుడు నాలుక మడత పెట్టారని విమర్శించడం చూస్తే పవన్ కల్యాణ్ చంద్రబాబుపై తీవ్రస్వరంతో ముందుకు వస్తున్నారని అంటున్నారు.

పవన్ కల్యాణ్‌కు ఆ రెండు పార్టీలూ టార్గెట్...
తెలుగుదేశం-బిజెపి ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని, తాము తిరగబడితే తట్టుకోలేరని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దీంతో ఇకపై ఆ రెండు పార్టీలపై ఆయన యుద్ధం ప్రకటించినట్టేననే సంకేతాలను ప్రజలకు పంపించారు. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో బిజెపి, టిడిపిలపై విమర్శలను ఎక్కుపెడుతూ రంగంలోకి దిగుతారని కూడా భావించడానికి అవకాశం కల్పించారు.

జగన్ వల్లనే పవన్ కల్యాణ్ ఇలా..
ప్రత్యేక హోదా అంశంపై జగన్ ఓ వైపు దూకుడుగా వ్యవహరిస్తుంటే తాము వెనకబడిపోతామనే ఉద్దేశంతో కూడా పవన్ కల్యాణ్ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. జగన్ దూసుకుపోతే రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న తాము ప్రభుత్వం పట్ల మెతకగా వ్యవహరిస్తే వెనుకబడిపోతామని భావించిన పవన్ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబందించి పవన్‌కు గత కొంతకాలం నుంచీ మాజీ ఐఏఎస్, ఐపిఎస్ సూచనలు చేశారని, అందువల్లనే ఆయన తన వైఖరి మార్చుకున్నారని అంటున్నారు.

ప్రత్యామ్నాయంగా రావాలంటే ఇదే...
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నామనే భావనకు తెరదించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్‌కు సలహాదారులు సూచించినట్లు చెబుతున్నారు. అందుకే ఆయనతన వ్యూహం మార్చుకుని, ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించినట్లు చెబుతున్నారు. పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం వర్గాలు కూడా ఇక పవన్ సొంత దారి చూసుకుంటున్నారనే నిశ్చయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత దూకుడుగా వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

జగన్‌పై విమర్శలు చేయని పవన్ కల్యాణ్..
ప్రత్యేక హోదా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని అంటూ గతంలో వైయస్ జగన్‌ను కూడా టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికార పార్టీలను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. హోదాపై జగన్ పోరాటం చేస్తున్నందున ఆయనను విమర్శిస్తే కొంత వ్యతిరేకత ఎదురు కావచ్చుననే అభిప్రాయం కూడా పవన్ కల్యాణ్‌కు ఉండవచ్చునని అంటున్నారు. జగన్, పవన్ కల్యాణ్ పోటాపోటీగా ప్రత్యేక హోదాపై నిరసన ప్రదర్శనను కొనసాగించారని చెప్పవచ్చు. ఈ స్థితిలో ఆచరణలో తప్ప మాటల్లో ఒకరినొకరు విమర్శించుకోలేని వాతావరణాన్ని కల్పించుకున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications