పవన్ కళ్యాణ్ పోరు మోడీ మీదనా, బాబు మీదనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, ప్రత్యేక హోదాల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెర మీదికి వచ్చారు. తనకు ఎవరిపైనా వ్యతిరేకత లేదని, ఎవరితోనూ విభేదాలు లేవని అంటూనే చేయాల్సిన విమర్శలు చేశారు, అడాల్సిన ప్రశ్నలు అడిగారు. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని విమర్శించినట్లు ఆయన కనిపించారు. రాష్ట్ర రాజధానికి భూమి సేకరణ జరుగుతన్న తీరును తప్పు పట్టారు. అయితే, ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల కాస్తా మెతగ్గానూ ప్రధాని నరేంద్ర మోడీపై కాస్తా ఘాటుగాను స్పందించినట్లు కనిపించారు.
భూసేకరణ విషయంలో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన తీరును, భూములను సేకరించిన తీరును ఓ వైపు ప్రశంసిస్తున్నట్లు కనిపిస్తూనే రైతుల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. ఒకేసారి 33 వేల ఎకరాలు సేకరించి, ఇక పంటలు వేయవద్దని రైతులను ఆదేశించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఓ రకంగా ఈ విషయంలో చంద్రబాబును ఆయన ప్రశ్నించినట్లే అనుకోవాలి. సింగపూర్, మలేషియా వంటి రాజధాని నిర్మాణం చేపట్టాలనుకోవడం స్వాగతించదగిందే అంటూ రాజధాని నిర్మాణం పూర్తవుతుందా, లేదా అనుమానాన్ని పక్కన పెట్టి రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతాయా అని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి 20, 25 ఏళ్ల సమయం పడుతుందని, తర్వాత వచ్చే ప్రభుత్వాలు చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు అమలవుతాయా అనేది పవన్ కళ్యాణ్ సందేహం. ఈ సమయంలోనే ఆయన మన దేశంలోని రాజకీయ అవినీతిని వేలెత్తి చూపించారు. అవినీతి కారణంగా అవి అమలయ్యే అవకాశాలు లేవని ఆయన పరోక్షంగా చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిచాలనేది ఆయన ఆంతర్యం. అలా చంద్రబాబు కల్పించగలదా అనేది సందేహమే. ఈ రకంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లే. చంద్రబాబు ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసినట్లే.

ఇకపోతే, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బందిపెట్టినట్లే కనిపిస్తున్నారు. సర్దిచెప్పుడు మాటలతో సరిపెట్టకూడదని ఆయన పరోక్షంగా చెప్పారు. ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమని కాస్తా ఘాటుగానే అన్నారు. తెలంగాణ కోసం అప్పట్లో ఇద్దరు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేసినప్పుడు ఇప్పుడు టిడిపి ఎంపీలు ఎందుకు చేయరని ఆయన అడిగారు. ఇది చంద్రబాబుకు ఓ విధమైన చురకలాటింది. కేంద్ర ప్రభుత్వంతో, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఇష్టం లేని చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై నోరు జారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టిడిపి ఎంపీలు పోరాటం చేయాలంటే చంద్రబాబు అనుమతి కావాల్సిందే.
తాము తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద పెట్టామని, తమ నాయకుడు చంద్రబాబు అనుమతిస్తే వాటిని తీస్తామని, ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాటం చేస్తామని ఇటీవల టిడిపి ఎంపీ శివప్రసాద్ అన్నారు. చంద్రబాబు మోడీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడేట్లు కనిపించడం లేదు. దీన్ని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు కనిపిస్తున్నారు. టిడిపి పోరాటం చేసే స్థితిలో లేదని ఆయన చెప్పకనే చెప్పారు. దానివల్ల చంద్రబాబు బలహీనతను పవన్ కళ్యాణ్ ఎత్తిచూపారని అంటున్నారు.
కాగా, బిజెపిపై ఆయన నేరుగానే విమర్శలు చేశారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బిజెపి మాట తప్పుతుందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలను సాకుగా చూపుతోందని ఆయన అన్నారు. బిజెపి స్పందించకపోతే తాను పోరాటానికి దిగుతానని కూడా ఆయన చెప్పారు. మోడీ స్పష్టమైన హామీలు ఇవ్వడం వల్లనే ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. బిజెపి నేతలతో మాట్లాడుతానని, వారు వినకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతానని ఆయన చెప్పారు. ఈ రకంగా చూసినప్పుడు ఆయన బిజెపికి సవాల్ విసిరినట్లు కనిపిస్తోందని అంటున్నారు. అటు బిజెపిని, ఇటు టిడిపిని ఇరకాటంలో పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పార్టీ బలోపేతానికి పాదులు వేసుకుంటున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications