వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు పవన్ తోడైతే: ఎన్టీఆర్‌కు ప్రత్యామ్నాయం!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోని ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. గత కొద్ది రోజులుగా టిడిపి కండువా కప్పుకున్న పవన్ ఫోటో సామాజిక వెబ్‌సైట్లలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇది మరింత చర్చకు దారి తీసింది. దీంతో పవర్ స్టార్ టిడిపి వైపు చూస్తున్నారా? అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. అభిమానులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, ఇంటర్నెట్‌లో వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా కొందరు నేతల మధ్య, అంతర్గత సంభాషణల్లో మాత్రమే నలుగుతున్న ఈ అంశం ఇప్పుడు బహిరంగంగా గుప్పుమంది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణ ఫొటోలతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. వీటిని పవన్, బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు.

Pawan Kalyan with TDP kanduva: Circulated in Internet

'సినీ రంగంలో పవన్ కల్యాణ్‌కు పవరుంది. చంద్రబాబు లెక్కకి, పవన్ కల్యాణ్ పవర్‌కు నందమూరి నటసింహం బాలయ్య తోడైతే ఎదురేముంది?' అంటూ ఖమ్మంలో ఓ ఫ్లెక్సీ ప్రత్యక్షమైంది. అభిమానుల ఆకాంక్షలు ఎలా ఉన్నప్పటికీ ఇటీవల బాలయ్య ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లి భేటీ అయ్యారని తెలియడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇటీవలి కాలంలో పవన్, బాలకృష్ణ మధ్య సంబంధాలు పెరిగాయట. బాలయ్య కుటుంబ సభ్యుల కోసం పవన్ తన తాజా సినిమా 'అత్తారింటికి దారేది' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయించారట కూడా.

బాలయ్యతో పవన్ కల్యాణ్ వ్యక్తిగత సంబంధాలు, టిడిపితో రాజకీయ బంధానికి దారి తీస్తాయా? అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇంతవరకూ పవన్ తన మనోగతాన్ని చెప్పలేదు. ఆయన కాంగ్రెస్ వ్యతిరేకి అన్నది అందరికీ తెలుసు. తన అన్న, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేస్తూ 'కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి' అని పిలుపునిచ్చారు.

అయితే ఆ తర్వాత ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై పవన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పవన్ సొంతగా ఓ పార్టీ పెట్టాలని పలువురు సూచించినా ఆయన అందుకు సుముఖంగా లేరట. అయితే, రాజకీయంగా ఒక దిశా నిర్దేశానికి తన వంతు పాత్ర పోషించాలన్న అభిప్రాయం మాత్రం ఆయనలో ఉందట. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి పట్ల కొంతసానుకూలతతో ఉన్నారా అనే చర్చ సాగుతోంది.

బరిలో నాగబాబు అంటూ ప్రచారం

మరో సోదరుడు నాగబాబును టిడిపి తరఫున మచిలీపట్నం ఎంపీగా బరిలో నిలపాలనే యోచనలో కూడా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు పవర్ స్టార్‌గా వెండితెరపై వెలుగుతూ 'పవనిజం' పేరిట తనదైన ముద్రను కొనసాగిస్తున్న పవన్ కల్యాణ్ మరో పార్టీలో, ఇంకొకరి నేతృత్వంలో పని చేయగలరా? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక పార్టీలో చేరడమంటే ఏదో ఒక ప్రాంతంలో 'వ్యతిరేకం' అనే ముద్ర పడిపోతోంది.

ఈ నేపథ్యంలో 'పవర్ స్టార్' ఏదైనా ఒక పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకుంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. తాజా వార్తలపై పవన్ అభిమాన సంఘాల ప్రతినిధులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో కొన్ని సామాజిక కోణాలు కూడా ఉన్నాయన్నది కొందరి విశ్లేషణ. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరారు. చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు వారు కూడా అందులోకి వెళ్లారు.

తాజాగా వైయస్ జగన్ కాంగ్రెస్‌కు దగ్గర అవుతున్నారన్న ప్రచారం ఆ వర్గం నేతల్లో అసంతృప్తి కలిగిస్తోంది. తమకు కాంగ్రెస్‌లో న్యాయం జరిగే అవకాశం లేదని భావిస్తున్న పలువురు టిడిపి వైపు మొగ్గు చూపుతుండవచ్చునంటున్నారు. మరోవైపు ఇంతగా ప్రచారం జరుగుతున్న పవన్ స్పందించలేదు. అయితే ఇలాంటి నిరాధార ప్రచారానికి పవర్ స్టార్ స్పందించాల్సిన అవసరం లేదనే వారు కూడా లేకపోలేదు.

సినీ పరిశ్రమలో ఇంకా భవిష్యత్తు ఉన్నందువల్ల పవన్ అప్పుడే నేరుగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమో లేదా తన సోదరుడు నాగబాబును ముందు నిలపడమో మాత్రం చేయవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరో విషయమేమంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరం కావడంపై మనస్తాపంతో ఉన్న పలువురు టిడిపి అభిమానులు పవన్ రాకతో ఆ లోటు భర్తీ అవుతుందని మాత్రం వ్యాఖ్యానిస్తున్నారట. ఈ ప్రచారంపై ఎవరైనా పెదవి విప్పాల్సిందే అంటున్నారు.

English summary
Is Chiranjeevi's brother, celebrity actor Pawan Kalyan looking to test political waters? The 42year old actor left everybody guessing about his political ambitions when at a gathering of his fans recently, he stirred them up to shout 'Jai hind'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X