ఎవరు: రేవంత్ ఫోన్ కీలకం, మత్తయ్యపై వ్యూహం?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ వ్యహారంలో రేవంత్ రెడ్డి ఫోన్ కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. ఆయన కాల్ డేటాను ఏసీబీ విశ్లేషిస్తోంది. రేవంత్ కస్టడీకి ముందే ఏసీబీ అధికారులు అన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగా రేవంత్ ఫోన్ కాల్ వివరాలను విశ్లేషిస్తున్నారు. దాని ద్వారా ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం వీరు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఏసీబీ అధికారులు ప్రతి ఆధారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. వీడియో, ఆడియో రికార్డులు ఉన్నప్పటికీ న్యాయ విచారణకు అవి మాత్రమే సరిపోవు. ఇంకా సాక్ష్యాలు, ఆధారాలు కావాల్సి ఉంటుంది.
వీటి సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రేవంత్ నుండి ఆయన స్టీపెన్ సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న వివరాలు రాబట్టాలనే ఆలోచనలతో ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ ఎమ్మెల్యే. కాబట్టి ఆయనతో ప్రభుత్వ వ్యక్తిగత సిబ్బంది ఉంటుంది.

సంఘటన జరిగినప్పుడు వారు వెంట లేరు. ఇందుకు గల కారణాలను కూడా విచారిస్తున్నారు. వారి నుండి కూడా వాంగ్మూలం సేకరించనున్నారు. డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తేలాల్సి ఉంది. నోట్ల కట్టల పైన బ్యాంకుకు సంబంధించిన ముద్రలు లేవు. దానిని ఎవరిచ్చారో తేలాల్సి ఉంది.
రేవంత్ కాల్ డేటాతో కుస్తీ పడుతున్న ఏసీబీ అధికారులు.. మరోవైపు మత్తయ్య అరెస్టును చేయక పోవడం వెనుక వ్యూహం ఉండవచ్చునని అంటున్నారు. మత్తయ్య తాను పరారీలో లేనని చెప్పారు. అయితే, ఆయన పరారీలో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. ఆయనను అరెస్టు చేయకపోవడం వ్యూహంలో భాగమని భావిస్తున్నారు.
ఈ సంఘటన వెలుగులోకి వచ్చాక మత్తయ్య ఎవరెవరిని కలిశారు, ఎవరితో మాట్లాడారు, ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌ను ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications