లేపాక్షి హబ్: వైయస్ కేటాయింపు, కిరణ్ వాటా?
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములపై కొరడా ఝళిపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు మంత్రులతో ఓ కమిటీని వేసిన విషయం తెలిసిందే. యనమల రామకృష్ణుడి నేతృత్వంలోని ఈ కమిటీ సోమవారం సమావేశమైంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వివిధ కంపెనీలకు అక్రమంగా లక్ష ఎకరాలను కేటాయించినట్లు చంద్రబాబు ప్రభుత్వం అనుమానిస్తోంది. యనమల రామకృష్ణుడి నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమావేశానంతరం కమిటీ సభ్యుడు పల్లె రఘునాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సీమాంధ్ర, తెలంగాణల్లో వైయస్ ప్రభుత్వం వివిధ కంపెనీలకు లక్ష ఎకరాలు అక్రమంగా కట్టబెట్టినట్లు ఆరోపించారు. అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలం లేపాక్షిలో బాలాజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి 2008లో లేపాక్షి నాలెడ్జి హబ్ కోసం 8844 ఎకరాలను గత వైయస్ ప్రభుత్వం కేటాయించింది. ఆరేళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు.
కమిటీ సమావేశంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేసి లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూములను వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి బాలాజీ కంపెనీ 800 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నట్లు కమిటీ గుర్తించింది. గత ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే బాలాజీ కంపెనీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది.
కోర్టు ఆర్డర్‌ను వెకేట్ చేయించడానికి సమర్థవంతుడైన న్యాయవాదిని నియమిస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. భూకేటాయింపులో వైయస్ ఏ విధమైన నిబంధనలను కూడా పాటించలేదని ఆయన విమర్సించారు. అధికారులను అడిగితే - తమ వద్ద ఏ విధమైన ఫైళ్లూ లేవని, ముఖ్యమంత్రి కార్యాలయమే భూకేటాయింపు జరిపిందని అంటున్నారు.
లేపాక్షి హబ్‌లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వాటాలున్నాయని మరో మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ మేరకు వాటాను కలిగి ఉన్నారనేది గుర్తించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications