నెలలో తెలంగాణ: మళ్లీ సోనియా జన్మదినం రోజే?
న్యూఢిల్లీ: నెలలో తెలంగాణ ఏర్పాటు పైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రకటన రానుందా? అంటే కావొచ్చుననే అంటున్నారు. ఇటీవల ఢిల్లీ పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును సాధ్యమైనంత త్వరగా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి తెలంగాణ ఏర్పడినట్టు రాష్టప్రతి ప్రకటన వచ్చేలా చూసేందుకు కొందరు పార్టీ సీనియర్లు, కేంద్రమంత్రులు గట్టిగా ప్రయత్నిస్తున్నారట.
2009 డిసెంబర్ 9 రాత్రి 11.15 గంటలకు అప్పటి హోంమంత్రి పి చిదంబరం సౌత్‌బ్లాక్‌లోని తన కార్యాలయం నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అర్ధరాత్రి ప్రకటనపై విమర్శలు, సీమాంధ్రలో నేతలు వరుసగా రాజీనామాలు చేయడంతో పదిహేను రోజుల తర్వాత రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వెనక్కి పోయింది. దీంతో గతంలో ఇచ్చినట్లుగా ఈసారి కూడా సోనియా జన్మదినం రోజే తెలంగాణ ప్రకటన వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన సగం పని పూర్తి కావచ్చినందున మిగతా సగం ప్రక్రియ అంటే జివోఎం నివేదికను కేంద్ర కేబినెట్‌లో ఆమోదించి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపించి అక్కడి నుంచి నవంబర్ నాలుగో వారంలో రాష్ట్ర శాసన సభకు పంపించాలని, రాష్ట్ర శాసన సభ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు బిల్లుపై చర్చించి తిరిగి పంపించేందుకు పది రోజుల సమయం ఇవ్వటం ద్వారా డిసంబర్ ఐదు నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదట వారంలోనే లోక్‌సభలో ప్రతిపాదించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గతవారం మీడియాతో మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను త్వరగా ముగించాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు. సోనియా జన్మదినానికి తెలంగాణ ప్రకటన వచ్చేలా చూసే యోచనతోనే షిండే ఈ ప్రకటన చేసి ఉంటారంటున్నారు. షిండే అధ్యక్షతన ఏర్పాటు చేసిన జివోఎంకు రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, నేతలు, ఉద్యోగ తదితర సంఘాలు, ప్రజలు రాష్ట్ర విభజన అనంతరం ఎదురయ్యే సమస్యలపై తమ అభిప్రాయాలను తెలుపవలసి ఉంది.
జివోఎం ఈనెల 7న భేటీ అవుతుంది. ఏదైనా కారణాల వలన 7న సమావేశం నిర్వహించలేకపోతే, మరుసటి రోజు అంటే నవంబర్ 8న సమావేశం అవుతుందని హోంశాఖ అధికార్లు చెబుతున్నారు. బహుశా ఇదే ఆఖరు సమావేశం కావచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జివోఎం మూడో సమావేశమే చివరిదైతే, ఆ తరువాత నాలుగైదు రోజుల్లోనే సిఫార్సులు కేంద్ర కేబినెట్ పరిశీలనకు వెళ్తాయని అంటున్నారు. కేంద్ర కేబినెట్ జివోఎం నివేదికను ఆమోదించి అదే రోజు రాష్టప్రతికి పంపించవచ్చునంటున్నారు.
అలా జరిగితే ప్రణబ్ నవంబర్ 20నాటికి తెలంగాణ ముసాయిదాను రాష్ట్ర శాసన సభకు పంపిస్తూ, తిప్పి పంపేందుకు పది రోజుల సమయం ఇవ్వవచ్చు. రాష్టప్రతి నిర్థారించిన సమయంలో శాసన సభ సమావేశమై బిల్లుపై చర్చించి తిరిగి రాష్టప్రతికి పంపించాల్సి ఉంటుంది. రాష్టప్రతి నిర్థారించిన గడువులోగా శాసన సభ తెలంగాణ బిల్లుపై చర్చించి వెనక్కి పంపించలేకపోతే దాన్ని శాసన సభ ఆమోదించినట్టు భావిస్తారు. ఇదే జరిగితే డిసెంబర్ మొదటి వారానికి తెలంగాణ బిల్లు లోక్‌సభలో ప్రతిపాదించేందుకు సిద్ధంగా ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications