బాబు ఫ్యాక్టర్: కెసిఆర్‌తో పోటీకే టీ కాంగ్రెసు మొగ్గు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేసుకునే ఆలోచనను కాంగ్రెసు తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అంశం అందుకు మొదటిది కాగా, టికెట్ల అంశం మరోటి అందుకు కారణమని చెబుతున్నారు. తెరాసను విలీనం చేసుకుంటే, తెలుగుదేశం పార్టీతో పోటీ పడాల్సి వస్తుందని, దానివల్ల తెలంగాణలో టిడిపి అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతుందని కాంగ్రెసు తెలంగాణ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖాముఖి పోటీలో తెలుగుదేశం పార్టీ ఉనికిలో కొనసాగడానికి వీలవుతుంది. బిజెపితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే అది బలాన్ని చాటుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
తెరాసను విలీనం చేసుకోకపోతే త్రిముఖ పోటీ ఉంటుందని, దానివల్ల తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బ తీయవచ్చునని కాంగ్రెసు తెలంగాణ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెసు వ్యతిరేక ఓటు లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే ఉంటుందని, ఈ స్థితిలో తమ పార్టీ ఓట్లు తమకు వస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెరాసకు వెళ్తాయని, తెరాసను విలీనం చేసుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీకి పడుతుందని కాంగర్ెసు తెలంగాణ ప్రాంత నాయకులు వాదిస్తున్నారు.

విలీనానికి కెసిఆర్ పలు షరతులు పెట్టే అవకాశాలున్నాయని, దీనివల్ల తమ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెసు తెలంగాణ నేతలు అంటున్నారు. చాలా మందికి టికెట్లు రాని పరిస్థితి ఏర్పడితే సమస్య పెరుగుతుందని వారంటున్నారు. తెరాసను విలీనం చేసుకోకపోతే టికెట్లు చాలా మందికి లభిస్తాయని, వారు తెరాసనూ టిడిపినీ ఎదుర్కోవడానికి సిద్ధపడుతారని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెసు తెచ్చిందే సానుభూతి ఎన్నికల్లో పనిచేస్తుందని కూడా అంటున్నారు.
తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా తెరాసకు ప్రజల మద్దుతు ఉంటుందని, చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం వల్ల తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెసు నాయకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో కెసిఆర్ కూడా కాంగ్రెసులో పార్టీని విలీనం చేయకుండా ఒంటరిగా పోటీ చేయాలనే వాదనకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్‌పై ఈ విషయంలో ఒత్తిడి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెరాస పాత్ర వహించాల్సి ఉందని, అది తెరాసకు మాత్రమే సాధ్యమని తెరాస నాయకులు వాదిస్తూ వస్తున్నారు.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులపై తెరాస నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి నాయకులు విమర్శలు పెడుతూనే ఉన్నారు. పార్టీని కాంగ్రెసులో విలీనం చేయవద్దని బలమైన వర్గం ఒక్కటి తెరాసలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత గానీ కాంగ్రెసు, తెరాస మధ్య ఉండే సంబంధాలపై స్పష్టత రాదు. అంత వరకు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications