మీకు వాటా లేదు, ఇవ్వం!: ఏపీకి తెలంగాణ షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం షాకిచ్చింది! నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీరు చుక్క కూడా ఇవ్వలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ చెప్పింది.
కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేయాలంటే, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ విడుదల చేస్తే సాగర్ నుంచి తాము విడుదల చేస్తామని చెప్పిందని సమాచారం. కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల నిమిత్తం మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు ఇటీవల ఆదేశించింది.

దీంతో, బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సమాధానం ఇచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 803 అడుగుల వద్ద నుంచి దిగువకు దాదాపు పదిహేడు-పద్దెనిమిది టీఎంసీల నీరు లభిస్తుందని, ఆ నిల్వ నుంచి మూడు టీఎంసీలను ఏపీ విడుదల చేస్తే, ఆ మేరకు తాము సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తామని చెప్పింది.
కాగా, శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లు నిండితేనే రెండు రాష్ర్టాలకు నీటి కరువు తీరుతుంది. లేదంటే, శ్రీశైలంలో 803 అడుగులకు దిగువన ఉన్న పదిహేడు-పద్దెనిమిది టీఎంసీలు, సాగర్‌లో 509 అడుగులకు దిగువన ఉన్న 130 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తాగునీటి కోసం రెండు రిజర్వాయర్లను ఖాళీ చేయడం మినహా మార్గంలేదని తెలుగు రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications