సమైక్యాంధ్ర 'జగడపాటి': ఎవరీ లగడపాటి?
హైదరాబాద్: ఆయన తెలంగాణవాళ్లకు జగడపాటి, సీమాంధ్రవాళ్లకు సమైక్యాంధ్ర నేత. కాంగ్రెసు అధిష్టానానికి కొరుకుడు పడని కొయ్య. ఆయనే లగడపాటి రాజగోపాల్. తన మామ పర్వతనేని ఉపేంద్రను పక్కన పెట్టి కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయవాడ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టి రాజకీయ నాయకుడిగా మారిన లగడపాటి పారిశ్రామికవేత్త. గత ఐదేళ్లుగా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న నాయకుడు. 2009లో ఆయన సమైక్యాంధ్ర పోరాటం ద్వారా వార్తల్లో వ్యక్తిగా మారారు.
విజయవాడలో సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పుడు తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి నుంచి ముద్దు తీసుకోవడం ద్వారా, పోలీసుల కళ్లు గప్పి విజయవాడ నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు రహస్యంగా చేరుకోవడం ద్వారా అందరి దృష్టినీ ఆయన ఆకర్షించారు. సమైక్యాంధ్రను కాపాడుతానని ప్రతిజ్ఞ చేసి, అందుకు పాశుపతాస్త్రాం వాడుతానని, విభజనను అడ్డుకోలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

1996, 98 ఎన్నికల్లో విజయవాడ నుంచి లోక్‌సభకు ఎన్నికైన లగడపాటి మామ పర్వతనేని ఉపేంద్ర 1999 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ చేతిలో ఒటమి పాలయ్యారు. తిరిగి 2004 ఎన్నికల్లో పోటీకి సమాయత్తమవుతుండగా అల్లుడు రాజగోపాల్ కోసం సీటును త్యాగం చేశారు. 2009 ఎన్నికల నాటికి అల్లుడితో విభేదించిన ఉపేంద్ర ప్రజారాజ్యంలో చేరి ఆ తర్వాత కొద్దికాలానికి అనారోగ్యంతో కన్నుమూశారు. తొలుత రాష్ట్ర విభజనపై 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం నుంచి తొలి ప్రకటన వెలువడిన వెంటనే తీవ్రంగా స్పందించిన లగడపాటి ఆమరణదీక్ష ప్రారంభించారు.
ల్యాంకో సంస్థ రుణ బకాయిలు వేల కోట్లలో ఉంటే అందులో కొంతమేర రద్దు చేయించుకుని మిగిలిన వాటికి గడువు తెచ్చుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే లగడపాటి మాత్రం వ్యాపారాల్లో ఇది సహజమే అన్నారు గానీ వారి ఆరోపణలను ఏనాడూ పూర్తి స్థాయిలో ఖండించలేదు. ఈ పరిణామ క్రమంలో వివిధ వర్గాల వారు లగడపాటి ఎంపి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గోవాలని డిమాండ్ చేశారు. దాంతో విభజనంటూ జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆర్థిక వనరులు లగడపాటి సమకూర్చారని తెలంగాణవాదుల నుంచి విమర్శలు ఎదుర్కున్నారు. తెర వెనుక లగడపాటి సాగిస్తున్న వ్యవహారాన్నింటినీ గమనించిన అధిష్టానం పలు దఫాలు హెచ్చరికలు కూడా చేసినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన ఎటూ ఖాయమని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ముందుగా ప్రకటించినట్టు లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఈసారి లగడపాటికి విజయవాడ టికెట్ లభించే అవకాశాలు లేవని, ఆ సీటుపై కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కన్నేశారని వార్తలు వచ్చాయి.
2004 ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్లుపైగా ఆధిక్యతతో గెలిచిన లగడపాటి ఆ తరువాత 2009 ఎన్నికల్లో కేవలం 12వేల ఓట్ల అధిక్యతతో మాత్రమే విజయం సాధించారు. ఈ స్థితిలోనే చావో రేవో తేల్చుకోవడానికి యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు నాయకత్వం వహించారని అంటున్నారు. పైగా, స్థానికంగా ఆయనకు కాంగ్రెసు నాయకుల నుంచి పెద్దగా మద్దతు లేదు.
ఆయన ప్రాతినిధ్యం వహించే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గెలుపొందింది ఇద్దరే ఇద్దరు.. వీరిలో ఒకరైన మల్లాది విష్ణు, మరొకరు డి పద్మజ్యోతి. ఏ ఒక్కరు కూడా మొదటి నుంచి లగడపాటిని అనుసరించడంలేదు. ప్రజారాజ్యం విలీనం తర్వాత కాంగ్రెస్‌లో చేరిన తూర్పు, పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి రవి, వెలంపల్లి శ్రీనివాసరావు నేటికీ చిరంజీవి కనుసన్నల్లోనే మసులుకుంటున్నారు. ఈ స్థితిలో లగడపాటి రాజకీయ జీవితం అగమ్యగోచరంగానే ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications