వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై జగన్, చంద్రబాబు లేఖల పాఠాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

 The letters given by YS Jagan and Chandrababu on Telangana
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హైదరాబాదులో, విభజన తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆ రెండు పార్టీలు తెలంగాణ అనుకూలంగా రాసిన లేఖలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఆ రెండు పార్టీలు రాసిన లేఖల పూర్తి పాఠాలు చదవండి...

2008 అక్టోబర్ 18న చంద్రబాబు లేఖ

గౌరవనీయులైన శ్రీప్రణబ్ ముఖర్జీ గారికి,

తెలంగాణపై మా పార్టీ అభిప్రాయం చెబుతూ రాసిన లేఖకు కొనసాగింపుగా... తెలంగాణ ప్రాంత ప్రజల భావోద్వేగాలు, వాటి తీవ్రత, తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ తన సీనియర్ నాయకులతో ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను పార్టీకి అందించింది. కోర్ కమిటీ అభిప్రాయాలపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో లోతుగా చర్చించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చేసిన సిఫారసును ఆమోదించింది. మా పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించిన తీర్మాన ప్రతిని మీకు పంపిస్తున్నాము.

- అభినందనలతో చంద్రబాబు నాయుడు.

2012 డిసెంబర్ 27న రాసిన మరో లేఖ

ప్రియమైన సుశీల్ కుమార్ షిండే జీ,

కేంద్ర హోంమంత్రిత్వ అదనపు కార్యదర్శి రాసిన డీవో లెటర్ నెంబర్ ఏఎస్ (సీఎస్)/పీపీఎస్ మిసిలేనియస్/2012, తేదీ 11 డిసెంబర్ 2012 మేరకు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరిని నియమిస్తున్నాను. మీ వైపు నుంచి కింది చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. గత ఎనిమిదేళ్లుగా ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అవినీతి, అసమర్థ పాలన, రాజకీయ అనిశ్చితి వల్ల వివిధ రంగాలలో మా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అభివృద్ధి దెబ్బతిని, పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. వ్యవసాయం, విద్యుత్ రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. సుసంపన్నంగా ముందుకు సాగాల్సిన రాష్ట్రం పరిస్థితి కొన్నేళ్లుగా అయోమయంలో పడింది.

దీని ఫలితంగా... ఉపాధి అవకాశాలు పడిపోయి యువతపై తీవ్ర ప్రభావం పడింది. పేదలు జీవనోపాధి అవకాశాలు కోల్పోతున్నారు. తెలంగాణ అంశం పరిష్కారం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని 26.09.2012వ తేదీన గౌరవనీయులైన ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన విషయం మీకు తెలుసు. ఈ అంశంపై 18.10.2008వ తేదీన అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో మా పార్టీ అభిప్రాయం వ్యక్తం చేశాం. ఆ లేఖ ఇప్పటికీ మీ ప్రభుత్వం వద్దే ఉన్నది. దానిని మేం వెనక్కి తీసుకోలేదు. మరోవైపు... కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభిప్రాయం చెప్పలేదంటూ 03.05.2012వ తేదీన అప్పటి హోంమంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఈరోజుకు వరకూ కాంగ్రెస్ తన అభిప్రాయం చెప్పనేలేదు. అందువల్ల, ఈ అనిశ్చితికి తెర దించుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా పార్టీ మరోసారి కోరుతోంది.

- అభినందనలతో.. చంద్రబాబు నాయుడు

2012 డిసెంబర్ 28న జగన్ పార్టీ లేఖ

శ్రీసుశీల్ కుమార్ షిండే గారికి,

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశంలోని అన్ని కులాలవారు, అన్ని వర్గాల వారు అలాగే అన్ని ప్రాంతాల వారు సుఖ సంతోషాలతో తమ జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ... భారత రాజ్యాంగంలో అనేక అధికరణలను పొందుపరిచారు. అధికరణలను అమలు పరిచే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అందులో భాగంగానే ఆర్టికల్-3ను రాజ్యాంగంలో పొందుపరిచి, రాష్ట్రాలను విభజించాలన్నా లేదా కలిపి ఉంచాలన్నా ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేంద్రానికే సర్వాధికారాన్ని ఇచ్చారు.

అందుకే, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా ఎన్ని పార్టీలు ఏమి చెప్పినా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే మీ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రం రావణకాష్టంగా మారింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అయినా, ఈ రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించి మా వైఖరిని ఇలా తెలియచేస్తున్నాము.

ఇంతకుముందు 2011 జూలై 8, 9 తేదీల్లో మేము మా పార్టీ మొదటి ప్లీనరీలో చెప్పినట్లుగా... తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నాం. ఆర్టికల్ - 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలన్నా, కలిపి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు, సర్వాధికారాలూ కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మేం అడిగేదల్లా, అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నాం.

- వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఎంవి మైసూరారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి

English summary
The letters given by YS Jagan and Chandrababu on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X