గేమ్: పవన్ కోసం టగ్ ఆఫ్ వార్, లీక్‌పై ఆగ్రహం
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. సీట్ల విషయమై టిడిపి, బిజెపి పార్టీల మధ్య పొత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పొత్తు విషయం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన పవన్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని టిడిపి, బిజెపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎవరితోనైనా చేతులు కలుపుతానని పవన్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో ఇరు పార్టీలు పవన్ కోసం చూస్తున్నాయి. బిజెపి నేత సోము వీర్రాజుకు పవన్ ఓ లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ సహా పవన్ ఏ ప్రాంతీయ పార్టీతోను పొత్తుకు అంత సిద్ధంగా లేరని, ఏదైనా ఉంటే పవన్ స్థాపించిన జనసేన పార్టీ కార్యాలయమే విడుదల చేస్తుందని పవన్ ఆదివారం సోము వీర్రాజుకు లేఖ రాశారట. దీంతో పవన్ టిడిపి కంటే బిజెపి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ఏ విషయమైనా పవన్ పార్టీ కార్యాలయమే చెబుతుందని మరో ప్రకటన విడుదల కావడం గమనార్హం.
కాగా, టిడిపి - బిజెపి పొత్తుపై ప్రతిష్టంభన నేపథ్యంలో... బిజెపి వర్గాలు వ్యూహాత్మకంగా పవన్‌ను టిడిపి వైపుకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే పవన్ ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోందని అంటున్నారు. అయితే బిజెపి, లోక్ సత్తా, టిడిపిలను ఒక్క తాటి పైకి తెచ్చి చంద్రబాబు నాయుడును గెలిపించడం కోసం పవన్ భారీ వ్యూహాలు రచిస్తున్నారనే వారు లేకపోలేదు. మరోవైపు, సమాచారం లీక్ అవుతుండటం పట్ల పవన్ ఒకింత ఆగ్రహంతో ఉన్నారంటున్నారు.












Click it and Unblock the Notifications