టర్కీలో విజయం వెనుక టెక్నాలజీ: 'గులెన్'పై డౌట్, అధ్యక్షుడి వైఖరే..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్తాంబుల్: టర్కీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారం కైవసం చేసుకునేందుకు చేసిన యత్నం విఫలమైంది. సైన్యంలోని అసంతృప్త వర్గం చేసిన తిరుగుబాటును ప్రజల అండతో ప్రభుత్వ సైన్యం ఎదుర్కొంది.

సైనిక కుట్రకు వ్యతిరేకంగా జనమంతా వీధుల్లోకి రావాలంటూ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఇచ్చిన పిలుపునకు ప్రజలు భారీ ఎత్తున స్పందించారు. అధికార జస్టిస్‌, డెవలప్‌మెంట్‌ పార్టీ (ఏకేపీ) మద్దతుదారులు తిరుగుబాటుదారుల నిషేధాంక్షల్ని తిప్పికొడుతూ, వారిని అడ్డుకుంటూ రోడ్లపైకి వచ్చారు.

కుట్రదారులకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన సైన్యం తిరుగుబాటును అణచివేసి, కుట్రదారులను అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో జరిగిన పోరులో మొత్తం సుమారు 265 మంది దాకా మరణించారని తెలుస్తోంది.

ఏం జరిగింది?

శుక్రవారం రాత్రి నుంచి టర్కీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు ఎర్డోగన్‌ టర్కీ తీరంలోని మర్మరిస్‌కు విశ్రాంతి కోసం వెళ్లారు. ఆ సమయంలో సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటుకు తెరలేపింది.

పదమూడేళ్లుగా ఎర్డోగన్‌ పాలనను సవాలు చేస్తూ కుట్రదారులు ట్యాంకుల్ని రహదారుల పైకి తీసుకొచ్చారు. జనం బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇస్తాంబుల్‌లోని బోస్ఫరస్‌ జలసంధి మీదున్న రెండు వంతెనల్ని మూసివేశారు.

తాము అధికారాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రకటించాలని అధికార టీవీని ఆదేశించారు. విమానాశ్రయాల్ని మూసివేశారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలతో అనుసంధానాన్ని అడ్డుకున్నారు. అధికార టీఆర్‌టీ టీవీని నియంత్రణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, మార్షల్‌లా విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం సైన్యం, జనం తిరగబడటంతో తిరగబడ్డ సైన్యం తోకముడిచింది.

టర్కీలో సైనిక తిరుగుబాటు: ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ నిలిపివేత

అధ్యక్షుడి ప్రకటన

ఆందోళనలు ఎప్పుడైనా చెలరేగవచ్చనీ, తిరుగుబాటు ఏ దశలోనైనా ఉన్నా, ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా శనివారం రాత్రికూడా వీధుల్లోనే ఉండి కాపాడుకోవాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ కోరారు. కుట్రను తిరుగుబాటుగా, ద్రోహంగా అభివర్ణించారు. తన విధులు నిర్వర్తించడాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

దేశద్రోహ చర్యకు వారు భారీమూల్యం చెల్లించుకుంటారని, మన దేశాన్ని ఆక్రమణదారులకు వదిలేయబోమని చెప్పారు. కుట్రకు పాల్పడిన అధికారుల్ని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.

గులెన్ హస్తంపై అనుమానం

తాజా పరిణామాలకు అమెరికా పెన్‌సిల్వేనియాకు చెందిన మతగురువు ఫెతుల్లా గులెన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కుట్రలో తనకెలాంటి ప్రమేయం లేదనీ, ఈ ఆరోపణలు తనను అవమానించడమేనని గులెన్‌ పేర్కొన్నారు.

గులెన్‌ సూత్రధారిగా ప్రభుత్వం యంత్రాంగంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమామ్‌గా శిక్షణ పొందిన ఈయన.. దాదాపు 50 ఏళ్లుగా దేశంలో ప్రాచుర్యం పొందారు. ఆధునిక విధానాలతో ఇస్లాంను రంగరించారు. ప్రజాస్వామ్యం, విద్య, సైన్స్‌, ఇతర మతాలతో సత్సంబంధాలను వాంఛించారు.

ఆయన మద్దతుదారులు అమెరికా సహా వందకుపైగా దేశాల్లో దాదాపు వెయ్యి పాఠశాలలను ప్రారంభించారు. టర్కీలో వారు విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, బ్యాంకు, పత్రికలు, రేడియో, టీవీ స్టేషన్లు నిర్వహిస్తున్నారు. టర్కీ ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో ఆయన అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉంటున్నారు. ఆయనను అప్పగించాలన్న టర్కీ ప్రభుత్వ వినతిపై అమెరికా పెద్దగా ఆసక్తి ప్రదర్శించడంలేదు.

Turkey coup: Mass arrests after coup bid quashed, says PM

టెక్నాలజీతో విజయం

సైనిక తిరుగుబాటు విఫలం కావడంలో ప్రజాశక్తితోపాటు టెక్నాలజీది కీలక పాత్ర. పలు ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిన సైనిక వర్గాలు... సామాజిక మాధ్యమాలు, టీవీ ప్రసారాలు, సెల్ ఫోన్ సంకేతాలను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి.

దీంతో దేశాధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగన్‌, ఆయన సన్నిహితులు తమ మద్దతుదారులకు ఈ మాధ్యమాల ద్వారా వేగంగా చేరువకాగలిగారు. సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చేందుకు వారికి పిలుపునిచ్చారు. ఓ పాత్రికేయుడి స్మార్ట్‌ఫోన్‌లోని 'ఫేస్‌ టైం' వీడియో యాప్‌ సాయంతో 'సీఎన్‌ఎన్‌ టర్క్‌' అనే ప్రయివేటుటీవీ ఛానెల్‌ ద్వారా ప్రజలకు ఎర్డోగన్‌ తన ప్రభావవంతమైన సందేశాన్ని వినిపించారు.

అధ్యక్షుడి వైఖరి తిరుగుబాటుకు కారణమా?

తిరుగు బాటు విఫలమైనా.. దీనికి అధ్యక్షుడు ఎర్డొగాన్‌ వ్యవహార వైఖరి ఇందుకు కారణమని అంటున్నారు. టర్కీ ప్రజాస్వామ్య చరిత్రలో ఎర్డొగాన్‌ అంతటి వివాదాస్పద నేత మరొకరు లేరు. 2001లో ఎర్డొగాన్‌ తన చిరకాల స్నేహితుడు అబ్దుల్లా గుల్‌తో కలిసి ఇస్లామిక్‌ భావాలున్న ఏకేపీ జస్టిస్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీని నెలకొల్పాడు. పార్టీని తన ఐదో సంతానంగా ఆయన పేర్కొంటారు.

ఆయనకు నలుగురు పిల్లలు. ఐదో బిడ్డగా పార్టీ అని చెబుతుంటారు. వివాదాస్పదమైన ప్రకటనలు చేయడంద్వారా ఆయన మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటారు. మహిళలు పురుషులతో ఎప్పటికీ సమానం కాలేరు అన్న ప్రకటన పెద్ద దుమారాన్ని లేపింది.

2013లో ఇస్తాంబుల్‌లోని గెజీ పార్క్‌ను ఆధునీకరించాలని యత్నించిన సమయంలో పర్యావరణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సైన్యానికి ఉన్న పలు రాయితీలను తొలగించడంతో సైన్యంలో అసంతృప్తికి దారి తీసింది.

ఆయన పార్టీలో ఇస్లామిక్‌ అతివాద భావాలు ఎక్కువగా ఉండటంతో దేశం తిరిగి అతివాదుల చేతుల్లోకి వెళ్లిపోతుందన్న ఆందోళనను ఉదారవాదులు వ్యక్తం చేస్తున్నారు. నూతన అధ్యక్ష భవనాన్ని 1,150 గదులతో నిర్మించారు. దీనిపై పలు విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు.

అమెరికా అధ్యక్ష తరహాలో పాలించాలన్నది ఆయన ఆశయమంటారు. ఇతనిది దుడుకు వైఖరి. విమర్శలను పట్టించుకోరు.ఎర్డొగాన్‌ హయాంలోనే దేశంలో ఎక్కువగా ఉగ్రదాడులు జరిగాయి. అయితే, 2002 ముందు వరకు టర్కీలో అనిశ్చితి రాజకీయ పరిస్థితి ఉండేది. ఎర్డొగాన్‌ వచ్చాక ఆర్థికరంగంలో కీలక మార్పులు వచ్చాయి. ఆయనకు ప్రజలనుంచి విశేష మద్దతు లభించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The attempted coup was a "black stain on Turkish democracy", he said, with 161 civilians and police killed.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి