నవీద్ టెర్రర్ అటాక్: ఎవరు ఆ వ్యాపారవేత్త?
శ్రీనగర్: కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇటీవల జరిగిన మిలిటెంట్ దాడికి సహకరించిన వ్యాపారవేత్త కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ దాడిలో సజీవంగా పట్టుబడ్డ నవీద్ యాకూబ్ అనే పాక్ మిలిటెంట్‌కు ఈ వ్యాపారవేత్త డబ్బు ఇచ్చినట్లు తేలింది. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తమకు పట్టుబడిన మిలిటెంట్ నవీద్ నుంచి అనేక వివరాలను ఎన్‌ఐఏ అధికారులు రాబడుతున్నారు. ఇప్పటివరకు తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశానని, ఇక తాను చెప్పేదేమీ లేదని నవీద్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్రవేశించడానికి ఏ మార్గం ద్వారా వచ్చారన్న విషయాన్ని రాబట్టేందుకు తాము అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
నవీద్‌ను సోమవారం జమ్మూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటివరకు పాక్ మిలిటెంట్ అందించిన వివరాలను బట్టి అతడికి సహకరించినట్లుగా భావిస్తున్న వ్యాపారవేత్త కోసం ఇటు రాష్ట్ర పోలీసులు, అటు కేంద్ర భద్రతా ఏజెన్సీలు గాలింపు చర్యలు చేపట్టాయి. లష్కరే తోయిబా కేడర్‌కు అందించడానికి ఈ వ్యాపారవేత్త ఐదు లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

కాశ్మీర్‌లో లష్కరే తోయిబా నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి, అలాగే దాడులు చేయడానికి ఈ మొత్తాన్ని ఆ వ్యాపారవేత్త అందించడాని నావెద్ అందించిన వివరాలను బట్టి అధికారులు రాబట్టారు. అలాగే శ్రీనగర్‌లోని ఈ వ్యాపారవేత్త ఓ షాపును నడుపుతున్నట్లుగా కూడా తెలుసుకున్నారు.
ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే నవీద్ చెప్పే మాటల్లో, చేసే ప్రకటనల్లో స్పష్టత లేదని, కొత్త కథనాలను తెరపైకి తెస్తున్నాడని అధికారులు తెలిపారు. ముఖ్యంగా భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై ఒక్కోసారి ఒక్కోమార్గం గురించి చెబుతూ వచ్చాడన్నారు. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధ చట్టం, భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద నవీద్‌పై కేసులు దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications