కార్పోరేట్ కాలేజీల వార్: నారాయణ వర్సెస్ శ్రీచైతన్య

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఇరు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న రెండు కార్పోరేట్ కాలేజీల మధ్య వార్ బద్దలైంది. నారాయణ, శ్రీచైతన్య కార్పోరేట్ కాలేజీలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ వీధికెక్కాయి. గతంలో ఇతర పోటీ సంస్థలను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్న ఆ రెండు విద్యాసంస్థలు ఇప్పుడు పరస్పరం అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి.

కార్పోరేట్ కాలేజీల విద్యార్థులు ఓ వైపు ఒత్తిళ్లకు గురువుతున్నామనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాయి. ఈ స్థితిలో రెండు విద్యాసంస్థల మధ్య వైరం పరిస్థితి తీవ్రతను బయటపెడుతోంది.

రెండు విద్యాసంస్థలు కూడా ఇక కలిసి పయనించే వాతావరణం లేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ముగ్గురు విద్యార్థుల బదిలీ ఇరు విద్యాసంస్థల మధ్య చిచ్చు పెట్టింది.

ఎన్నో అవమానాలు భరించాం....

ఎన్నో అవమానాలు భరించాం....

నారాయణ విద్యాసంస్థలతో ఐదేళ్లుగా కలిసి పని చేస్తున్నామని, ఆ కాలంలో ఎన్నో అవమానాలు భరించామని, మరెన్నో మోసాలు చూశామని, ఇక తమ ఓపిక నశించిందని, అందుకే నారాయణ విద్యాసంస్థలతో కలిసి ప్రయాణం చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చామని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ బొప్పన అన్నారు. శుక్రవారం నెల్లూరులో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అది అలా జరిగింది....

అది అలా జరిగింది....

నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లారనే ఆరోపణలపై సుష్మ బొప్పన్న స్పందించారు. వారం రోజుల క్రితం నెల్లూరు నుంచి ముగ్గురు విద్యార్థులు హైదరాబాదులోని శ్రీచైతన్య కోచింగ్‌ సెంటర్‌లో చేరేందుకు వచ్చారని, వారిని తల్లిదండ్రులే తీసుకొచ్చి తమ సంస్థలో చేర్చారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు.

కిడ్నాప్ చేశామంటూ....

కిడ్నాప్ చేశామంటూ....

రెండు రోజుల క్రితం విద్యార్థులను తాము కిడ్నాప్‌ చేశామని ఆరోపిస్తూ ఓ విద్యార్థి తల్లితో నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు పోలీసు కేసు పెట్టించారని సుష్మ అన్నారు. రెండు రోజులుగా తమ సిబ్బంది రమేష్‌, పార్ధసారథిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎవరికీ కనిపించకుండా దాచారని ఆరోపించారు. దీనిపై ఎస్పీని, పోలీసు అధికారులను ప్రశ్నిస్తే..తమ వద్ద చేరిన ముగ్గురు విద్యార్థులను నెల్లూరు పంపాలని, అప్పుడే చైతన్య సిబ్బందిని విడుదల చేస్తామని చెబుతున్నారని అన్నారు. అసలు ఈ కేసుపై ఇప్పటివరకు తమ వద్దకు పోలీసులు వచ్చి విచారణ చేయలేదని అన్నారు.

అధికార బలంతో, రాజకీయ పైరవీలతో....

అధికార బలంతో, రాజకీయ పైరవీలతో....

అధికార బలంతో, రాజకీయ పైరవీలతో నారాయణ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని సుష్మ ఆరోపించారు. 31 సంవత్సరాల నుంచి శ్రీచైతన్య విద్యాసంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని అంటూ విద్యార్థులను ఎలా కిడ్నాప్‌ చేస్తామని ప్రశ్నించారు. ఏటా తమ ఫలితాలను కూడా వారి ఫలితాలుగా ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. ఇక నారాయణ విద్యాసంస్థలతో పనిచేసేది లేదని స్పష్టం చేశారు. తమ సిబ్బందిని స్టేషన్‌ నుంచి ఎలా రప్పించుకోవాలో తెలుసని, మంత్రి నారాయణ సొంత జిల్లాకే వచ్చామని, సిబ్బందిని విడిపించుకొనే వెళుతామని అన్నారు.

నారాయణ విద్యాసంస్థల ఆరోపణ ఇదీ....

నారాయణ విద్యాసంస్థల ఆరోపణ ఇదీ....

నారాయణ విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రలోభపెట్టి హైదరాబాద్‌కు తరలించడమే కాకుండా తమపై శ్రీచైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు నిందలు వేయడం సరికాదని నారాయణ విద్యా సంస్థల జీఎం విజయ్‌ భాస్కర్‌ రెడ్డి అన్నారు. నారాయణ విద్యా సంస్థలపై శ్రీచైతన్య విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుష్మ ఆరోపణలు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తమ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టి తరలించిన శ్రీచైతన్య తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అనేక ఆరోపణలు చేస్తోందని అన్నారు.

నిర్వీర్యం చేసింది...

నిర్వీర్యం చేసింది...

మొదటి నుంచి కూడా అనేక విద్యా సంస్థల్లో విద్యార్థులను అడ్డగోలుగా తీసుకెళ్లి ఆయా సంస్థలను శ్రీచైతన్య నిర్వీర్యం చేసిందని విజయ్ భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగా తమ విద్యా సంస్థపైనా పలుమార్లు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఈనెల 10న విశాఖపట్నంలోనూ ఇలానే విద్యార్థులను ప్రలోభపెట్టిందని చెప్పారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దలేక పరాయి సంస్థల్లోని విద్యార్థులను ప్రలోభపెట్టి పబ్బం గడుపుకోవడంలో శ్రీచైతన్య దిట్ట అని చెప్పారు. ఈ విషయం అనేకసార్లు రుజువైందని, తాజాగా తమ విద్యార్థులను ఇలాగే తరలించారని ఆరోపించారు

అందుకే ఫిర్యాదు...

అందుకే ఫిర్యాదు...

విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రలోభపెట్టిన డీన్‌ ఎల్‌.రమేశ్‌, ఏజీఎం పార్ధసారథిపై పాజిల్‌ అహ్మద్‌ తల్లిదండ్రులు రియాజ్‌ అహ్మద్‌, ఆరీఫాలు వన్‌ టౌన్‌లో ఫిర్యాదు చేశారని విజయ్ భాస్కర్ రెడ్డి చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతుంటే, తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శ్రీచైతన్య ఎదురు దాడికి దిగడం బాధాకరమని అన్నారు.

శ్రీచైతన్యది నీచ సంస్కృతి...

శ్రీచైతన్యది నీచ సంస్కృతి...

విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించకుండా నీచ సంస్కృతికి పాల్పడుతోందని విజయ్ భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా శ్రీచైతన్య నిర్వాహకులు విద్యార్థులను తరలించే దుష్ట సంస్కృతికి స్వస్తి పలకాలని హితవు చెప్పారు. విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం సహజమేనని చెబుతున్న సుష్మ విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను తరలించడంలో ఆంతర్యమేంటో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ర్యాంకుల కోసం ఇతర విద్యా సంస్థల విద్యార్థులను కొనుగోలు చేస్తూ అడ్డుకున్న వారిపై ఆరోపణలు చేయడం అనైతికమని, ఇలాంటి దుశ్చర్యలు మానుకుని హుందాగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
War between two corporate colleges Narayana and Sri chaitanya erupted on the transfer of three students. The two collhes working together in Andhra Pradesh and Telangana may split

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి