దక్షిణాఫ్రికాతో ఇండియా: టెస్టులు కూడా తుస్సేనా?
సెంచూరియన్: దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత క్రికెట్ జట్టు టెస్టుల్లోనైనా పోటీ ఇస్తుందా అనేది సందేహంగానే ఉంది. వన్డేల్లో ఆడినట్లే ఆడితే టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోవడం ఖాయం. సొంత గడ్డపై అద్భుతాలు సృష్టించిన టీమిండియాకు తమ సొంత పిచ్‌లపై సఫారీలు చుక్కలు చూపిస్తున్నారు. వన్డేల్లో బ్యాట్స్‌మెన్ కనీసం 50 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. భారత జట్టు వరుసగా రెండు వన్డేల్లో వందకు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం 2006 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇప్పటి వరకు దడదడలాడించిన శిఖర్ ధావన్ దక్షిణాఫ్రికా వన్డేల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇండియా ఏ జట్టు తరఫున గతంలో దక్షిణాఫ్రికాలో అతను ఆడాడు. ఇప్పుడు కూడా తాను సత్తా చాటుతానంటూ సఫారీ గడ్డపెై అడుగు పెట్టాడు. కానీ అప్పుడు ఆడిన ప్రిటోరియాలాంటి నాసిరకం వికెట్‌తో పోలిస్తే ఎంతో తేడా ఉండే వాండరర్స్, కింగ్స్‌మీడ్‌లలో బంతిని అంచనా వేయలేక అవుటయ్యాడు.

ఎలాంటి పరిస్థితుల్లోనెైనా తట్టుకుని నిలబడతాడని భావించిన విరాట్ కోహ్లి, సూపర్ ఫామ్‌లో కనిపించిన రోహిత్ శర్మలది కూడా ఇదే పరిస్థితి. ధోని ఈ విషయంలో తన అసంతప్తిని దాచుకోలేదు. గత కొన్ని సిరీస్‌లలో తమ మిడిలార్డర్ పెద్దగా రాణించలేదని, కనీసం రెండో వన్డేలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై కూడా మన బ్యాట్స్‌మెన్ సఫలం కాలేదని అన్నాడు.
వన్డేల్లోతన జట్టు ఆటతీరు చూస్తే మాత్రం టెస్టులో అనుకూల ఫలితాలు ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే వన్డే సిరీస్‌లో ఓటమిపాలెైనా అక్కడి పరిస్థితులు, వికెట్‌ల గురించి తెలుసుకునేందుకు మన ఆటగాళ్లకు అవకాశం దక్కింది. టెస్టులకంటే ముందు వన్డే సిరీస్ జరగడం వల్ల కాస్తా ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇదే మాట భారత కెప్టెన్ ధోనీ అంటున్నాడు.
ఈ నెల 18వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభమవుతోంది. దక్షిణాఫ్రికా పేస్‌ను, బౌన్స్‌ను టెస్టుల్లో ఎదుర్కోవడానికి వన్డే సిరీస్ ఉపయోగపడుతుందని ధోనీ అన్నాడు. వన్డే సిరీస్‌ను ఆ విధంగానే చూడాలని అతను అన్నాడు. తాము సానుకూల దృక్పథంతో టెస్టుల్లో ఆడుతామని అన్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగు పట్ల అతను సంతృప్తి వ్యక్తం చేశాడు.
అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను వన్డే సిరీస్‌లో ఓడించడం గర్వంగా ఉందని చెప్పిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీవిల్లీర్స్ టెస్టు సిరీస్ దానికి భిన్నమైందని అన్నాడు.