జూ.ఎన్టీఆర్ ఇష్యూ, హరికృష్ణతో భేటీ: కొడాలి నాని సైకిల్ ఎక్కుతారా?
హైదరాబాద్: గుడివాడ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో చేరుతారా? అనే చర్చ ఇప్పుడు కృష్ణా జిల్లాలో సాగుతోంది. శనివారం నాడు కొడాలి నాని టిడిపి నేతలు, నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూల దారిలోనే కొడాలి నాని కూడా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాకిస్తారా? సైకిల్ ఎక్కుతారా? అనే చర్చ శనివారం నుండి సాగుతోంది. హరికృష్ణ తనకు రాజకీయ గురువు అని, ఆయనను కలిసేందుకే తాను వచ్చానని, తాను వైసిపిని వీడేది లేదని నాని చెప్పారు.
అయినప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ వంటి నేతలు వైసిపిని వీడుతారని భావించలేదు. అలాగే కొడాలి నాని కూడా పార్టీ వీడినా ఆశ్చర్యపోయే అవకాశం లేదనే వాదనలు ఉన్నాయి.

అయితే, కొడాలి నాని రాజకీయ నిర్ణయాలను చూస్తే మాత్రం ఆయన వైసిపిని వీడే అవకాశాలు ఏమాత్రం లేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కొడాలి నానికి నటుడు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో మంచి సంబంధాలు ఉన్నాయి. నాలుగైదేళ్ల క్రితం.. జూనియర్ ఎన్టీఆర్‌ను టిడిపిలో ఎదగనీయడం లేదనే కారణంతోనే కొడాలి నాని.. ఆయనకు మద్దతుగా టిడిపిని వీడి వైసిపిలో చేరారనే వాదనలు ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానిల మధ్య సంబంధం అందరికీ తెలిసిందే. జూనియర్ కోసమే ఆయన వైసిపిలో చేరారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌కు అవకాశం లేదనే చెప్పవచ్చు. ఇప్పటికే చంద్రబాబు వారసుడిగా లోకేష్ నిర్ణయమైపోయారు.
చంద్రబాబు వారసుడిగా లోకేష్‌ను తీసుకు రావడాన్ని హరికృష్ణ కూడా వ్యతిరేకించారు. ఆయన బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హరికృష్ణ ఇప్పటికీ వారసత్వం విషయంలో చంద్రబాబు పట్ల ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి మద్దతుదారు అయిన కొడాలి నాని ప్రస్తుతానికి టిడిపిలో చేరే అవకాశాలు మాత్రం చాలా తక్కువే అంటున్నారు.












Click it and Unblock the Notifications