జగన్‌కు అది అర్థం కాదు: నారా లోకేష్ ఢీ, సవాల్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శనివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నదని చెబుతూ.. అంత ఖర్చు చేయడం అవసరమా.. అలాంటి ప్రమాణ స్వీకారానికి తాను వెళ్లనని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
దీనిపై లోకేష్ సవాల్ చేశారు. ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు జగన్ నిరూపించగలరా అని సవాల్ విసిరారు. టిడిపిని, చంద్రబాబును విమర్శించడం జగన్‌కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ఇంత గ్రాండ్‌గా చేయడానికి కారణముందని చెప్పారు. పారిశ్రామికవేత్తల నుండి పెట్టుబడులు, కేంద్రం నుండి కొత్త రాష్ట్రం అభివృద్ధికి సహకారం కోసమేనని, ఇది జగన్‌కు అర్థం కాదని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఇలాంటి రాష్ట్రం అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తల దృష్టి పడుతుందని, అలాగే కేంద్రం నుండి రాష్ట్రాభివృద్ధికి సహకారం లభిస్తుందని నారా లోకేష్ వివరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తన ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
నారా లోకేష్ శనివారం ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు రావడం ముందు ముందు అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. కాగా, టిడిపి నేతలు కూడా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి పారిశ్రామికవేత్తల చూపు పడేందుకే గ్రాండ్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని శనివారం చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications