విజయమ్మ లేఖ: జగన్ మొండిగా వెళ్తున్నారా?

సమైక్యమంటూ బిల్లును వ్యతిరేకించేందుకు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని అందరూ జగన్ పార్టీ పైన మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేకంగా విలేకరుల సమావేశంలో అదే చెప్పారు. బిల్లులో భాగంగానే సమైక్య తీర్మానం పెట్టేందుకు అవకాశమున్నప్పటికీ, బిల్లుపై చర్చ లేకుండానే తీర్మానం ఆమోదించాలని పట్టుబట్టడం విమర్శలకు తావిస్తోంది. సీమాంధ్ర టిడిపి, సీమాంధ్ర కాంగ్రెసు కూడా సమైక్యమంటున్నాయి. చర్చ జరిగితే సమస్యలు చెప్పడం ద్వారా విభజనను అడ్డుకోవచ్చుననేది వారి వాదన.
సమైక్య తీర్మానమంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టుబట్టడం బిల్లుపై చర్చ జరగకుండా జగన్ కుట్ర చేస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. సభలో బిల్లుపై చర్చ జరగకపోయినా పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధమన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కారణంగా బిల్లుపై చర్చ జరగకుండా జగన్ పార్టీ కాలం వెళ్లదీస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సభ నుండి సస్పెండ్ అయ్యేందుకు వారు ప్రయత్నిస్తున్నారంటున్నారు.
తద్వారా పరోక్షంగా బిల్లుపై చర్చ జరగకుండా మద్దతుస్తూనే సీమాంధ్రలో లబ్ధి పొందేందుకు పావులు కదుపుతున్నారంటున్నారు. అయితే, అన్ని పార్టీల విమర్శలతో జగన్ పార్టీ ఆత్మరక్షణలో పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముసాయిదా బిల్లుపై చర్చకంటే ముందే ఓటింగ్ పెట్టాలని స్పీకర్‌కు లేఖ రాయడం ఆత్మరక్షణలో పడినట్లే అంటున్నారు. సమైక్య తీర్మానం కోసం పట్టుబడుతుండటాన్ని అన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి.
కాగా, జగన్ పార్టీ ఓటింగ్ పెట్టాలనడం ద్వారా కొత్త ఎత్తుగడకు తెరలేపిందంటున్నారు. ఇన్నాళ్లు సభలో సమైక్య తీర్మానం చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తూ.. ఇప్పుడు విభజన బిల్లుపైనే ఓటింగ్ పెట్టి, దానిని తిరస్కరించి రాష్ట్రపతికి తిప్పి పంపాలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీనిపై ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాసిన లేఖను స్పీకర్‌కు ఇచ్చారు.
విభజన బిల్లుపై సభలో చర్చించి అభిప్రాయాలు తెలపాలని మాత్రమే రాష్ట్రపతి ఆదేశించారు. బిల్లుపై ఎలాంటి ఓటింగ్ ఉండదు. కానీ క్లాజులపై సవరణలు ప్రతిపాదిస్తే, వాటిపై ఓటింగ్ జరపవచ్చు. క్లాజుల వారీగా చర్చించి సవరణలు ప్రతిపాదిస్తూ విభజనకు వ్యతిరేకమైన అభిప్రాయాన్ని ఓటింగ్ ద్వారా రాష్ట్రపతికి తెలపాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఇది జరగాలంటే సభలో చర్చ సజావుగా సాగాలి. అయితే అసలు చర్చే జరగడానికి వీల్లేదని, నేరుగా బిల్లుపై ఓటింగ్ జరపాలని జగన్ పార్టీ మెలిక పెట్టడమేమిటంటున్నారు.












Click it and Unblock the Notifications