బెజవాడకు జగన్ ఆఫీస్: సాయిరెడ్డి ‘కీ’రోల్
హైదరాబాద్/విజయవాడ: హైదరాబాద్‌లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని త్వరలోనే విజయవాడకు మార్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని ప్రస్తుతం ఆ పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు. విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న సాక్షి కార్యాలయం సుమారు మూడెకరాల్లో ఉందని, అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన జిల్లా పార్టీ నాయకులు వ్యక్తం చేసినట్లు సమాచారం.
పార్టీ నేతలు విజయ సాయిరెడ్డి, పార్థసారథి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గౌతంరెడ్డి తదితరులు ఆదివారం ఆ ప్రాంగణాన్ని పరిశీలించారు. కాగా, విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి సాయిరెడ్డి తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అక్కడున్న సాక్షి కార్యాలయాన్ని మంగళగిరి ప్రాంతంలోకి తరలించే అవకాశం ఉందని, అది పూర్తయ్యాక ఆటోనగర్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైనందున ఇక్కడే పార్టీపరంగా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, అందువల్ల విజయవాడను కేంద్రంగా చేసుకుంటేనే వాటిని నిర్వహించగలమని పార్టీ నేతలు చెబుతున్నారు.

నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ధర్నాలను విజయవాడ కేంద్రంగానే ప్రారంభించే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తాత్కాలికంగా లోటస్‌పాండ్‌లోని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసానికి మార్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరులోనే మార్చాల్సి ఉన్నప్పటికీ, ఒకేసారి విజయవాడకు తరలిస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే దీన్ని వాయిదా వేసినట్లు సమాచారం.
విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాల్లో ఎక్కువ శాతం విభాగాల ఇంఛార్జీల బాధ్యతలు ఆయనకే ఇచ్చారు. ఏపిలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సమీక్షలు, కార్యక్రమాల రూపకల్పన కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల సమీక్షలను ఇప్పటికే ఆయన ప్రారంభించారు.
అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో విజయసాయిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పార్టీలో సీనియర్ నేతలున్నప్పటికీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జగన్ ఆస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎ-2 నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications