"కాంగ్రెస్ పులి" కల్లూరు సుబ్బారావు ఎవరు..? స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి..?
దేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఘనంగా ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని గుర్తింపు దక్కని కొందరు సమరయోధుల సేవలను గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతోంది.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కల్లూరు సుబ్బారావు ఆయన జీవితం, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పోషించిన పాత్ర గురించి తెలుసుకుందాం.
కల్లూరు సుబ్బారావు అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు.సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు.

17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1920లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని, అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య లతో స్నేహాన్ని పెంచుకున్నాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశాల్లో స్వచ్ఛంద సేవకునిగా పనిచేశారు. అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళి, మొత్తం ఏడేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఆంగ్లేయులు ఈయన్ను కాంగ్రెస్ పులి అని అభివర్ణించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈయన్ను జైలు పట్టభద్రుడు అని కొనియాడాడు. సుబ్బారావు లోకమాన్య అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు.
స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైయ్యారు. 1955లో శాసనసభ డిప్యూటీ స్పీకరుగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 1967లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుబ్బారావు 1973, డిసెంబరు 21న మరణించారు.












Click it and Unblock the Notifications