2018లో బడ్జెట్: రైతు ఆదాయం రెట్టింపయ్యేదెన్నడు? వ్యవ‘సాయం’ అందేనా?
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ రంగం ఆదాయం రెట్టింపు చేస్తామని 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ పదేపదే ప్రజలకు హామీలు గుప్పించారు. కేంద్రంలో ఆయన సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటింది. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ సర్కార్ కళ్లు తెరిపించినట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. అందుకే దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనడానికి బయలుదేరడానికి ఒకరోజు ముందు ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతులు తమపై అసంత్రుప్తితో ఉన్నారని అంగీకరిస్తూనే, వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. అయినా దేశంలో ఈనాడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. 'రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా' అన్నట్లు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అన్నదాతను ఆదుకోవాలని నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కాదంటాయా? అన్న అనుమానాలు ఉన్నాయి.
Recommended Video

గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రతి స్పందిస్తూ 'ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అత్యంత ముఖ్యమైంది. ఈ రంగంలో అభివృద్ధిని సాధించకుండా దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది అని చెప్పలేము' అన్న ప్రకటన ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగంపై మోదీ సర్కార్ దృష్టిపెట్టిందని పరోక్షంగా సూచించింది.

60 కోట్ల మంది అన్నదాతలను ఆనందింపజేస్తారా?
2019 ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ సర్కారు ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. కనుక అత్యధికులకు ప్రయోజనాలు కల్పించే పథకాలను కచ్చితంగా ప్రకటించాల్సి ఉంటుంది. మన దేశంలో అత్యధికంగా 60 కోట్ల మంది ఆధారపడే రంగం వ్యవసాయమే. వరుసగా నాలుగేళ్లు కబుర్లతో కాలం గడిపి చివరి ఏడాది ఆపద మొక్కుల్లా వ్యవసాయాన్ని పండుగ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రుణ సదుపాయాలు, ఉత్పత్తుల నిల్వ, ఎరువుల కొరత, ధరలు పడిపోవడం, దళారీ వ్యవస్థ, వర్షాభావ సమయాల్లో పంట నష్టం భారీగా పెరిగిపోవడం వంటి సమస్యల పరిష్కారానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో అరుణ్ జైట్లీ ఏ మేరకు మార్గాలు చూపుతారోనని అన్నదాతలు ఆసక్తిగా చూస్తున్నారు.

రుణాల మంజూరు ప్రక్రియ సరళతరం చేసే చాన్స్
వ్యవసాయ రంగానికి ప్రాణవాయువు వంటి రుణాలందకపోతే రైతుకు పెట్టుబడులు లభించక భూములను ఎండబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 2016 నవంబర్‌లో నల్లధనం వెలికితీత పేరుతో అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం ముందు వ్యవసాయంపైనే పడింది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం, ప్రైవేట్ రుణాలు పొందేందుకు అవసరమైన నగదు మార్కెట్‌లో లేక అన్నదాత అవస్థలు పడ్డాడు. ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యం కంటే మరో 10శాతం కంటే ఎక్కువగానే నిర్దేశించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. నిర్ణయించుకుంది. దీంతో వ్యవసాయ రంగానికి రూ.11 లక్షల కోట్లు అందుబాటులోకి రావచ్చు. గత ఏడాది నిర్దేశించిన రూ.10లక్షల కోట్ల రుణలక్ష్యంలో సెప్టెంబర్ వరకు 6.25 లక్షల కోట్లను పూర్తి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికీ దేశంలోని 24కోట్ల మంది రైతులు ప్రైవేట్ రంగంలో రుణాలు పొందుతున్నారు. రైతులకు రుణ మంజూరు ప్రక్రియనూ మరింత సరళతరం చేసే అవకాశమూ ఉంది. వీలైనంత వరకు అన్నదాతలు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల నుంచే రుణాలు పొందేందుకు ఆసక్తి చూపేలా వడ్డీ సబ్సిడీని పెంచవచ్చని భావిస్తున్నారు. సరైన సమయంలో రుణం చెల్లించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలనూ పెంచవచ్చు.

నిల్వ వసతుల్లేక అల్లాడుతున్న అన్నాత
ప్రపంచంలోని పప్పుధాన్యాల్లో భారత్ ఉత్పత్తి వాటా దాదాపు 25 శాతం. వరిలో 22 శాతం, గోధుమల్లో 13 శాతం, పత్తి ఉత్పత్తిలో 25 శాతం వరకు భారతదేశంలోనే జరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక వ్యవసాయం చేసే తొలి మూడు దేశాల్లో భారత్ ఒకటైనా ఆ స్థాయిలో భారత్‌లో నిల్వ సౌకర్యాలు లేవు. దీంతో ఆహార ఉత్పత్తుల వృథా నానాటికీ పెరిగిపోతోంది. పండ్లు, కాయగూరల్లో అత్యధికంగా 15శాతం వరకు వృథా అవుతున్నాయి. ఇక పప్పుధాన్యాల్లో 8.5 శాతం వరకు, నూనె గింజల్లో 10 శాతం వరకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గోదాముల ఏర్పాట్లను మరింత వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫుడ్‌పార్క్‌లు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రూపొందించిన ప్రణాళికలను మరింత వేగంగా అమలు చేయాల్సి ఉంది. గత ఏడాది ఈనామ్‌ల సంఖ్యను 585కు పెంచారు. ఇక్కడ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వం కేటాంయిచే మొత్తాల్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది.

మద్దతు ధరలో కేంద్రం భారం భరిస్తుందా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని రైతులు తమకు మద్దతు ధర కోసం ఆందోళన బాట పట్టారు. గతేడాది గిట్టుబాటు ధర కోసం మధ్యప్రదేశ్, తెలంగాణలో ఆందోళనకు దిగిన అన్నదాతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి. సంకెళ్లతో కోర్టుకు తరలించిన నేపథ్యం ప్రభుత్వాలది. ఇదిలా ఉంటే రైతులకు ఇచ్చే ధరలు ఆర్థిక వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా అన్నదాత కొనుగోలుశక్తి పెరిగితే వ్యవస్థలో డిమాండ్ ఊపందుకుటున్నది. ఇది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇస్తుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని గ్రహించే ధరల స్థిరీకరణ కోసం గత ఏడాది దాదాపు రూ.3,500 కోట్లను కేటాయించింది. ఈ తరుణంలో 60 కోట్ల రైతులు ఉన్న దేశంలో ఈ మొత్తాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఇక, రైతుల మద్దతు ధరలు పడిపోతున్న ప్రతిసారీ రాష్ట్రాలు కేంద్రం వైపు చూడకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. కనీస మద్దతు ధరలో కేంద్రం సగానికి పైబడి భరించేందుకు సిద్ధమవ్వాల్సి ఉంది. ఉదాహరణకు సెనగల విషయాన్నే తీసుకుందాం. 2017-18లో వీటికి కనీస మద్దతు ధర బస్తాకు రూ.4,400గా నిర్ణయించారు. దీనిలో కేంద్రం రూ.1,760 వరకు చెల్లించింది. కొనుగోలు, నిల్వ, పంపిణీ తదితర ఖర్చులతోపాటు మిగిలిన నష్టాన్ని రాష్ట్రాలు భరించాయి. అది రాష్ట్రాలకు పెను భారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు కనీస మద్దతు ధరను బలంగా అమలు చేసేందుకు సిద్ధం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం సహకరిస్తే ధరలు పతనం అయ్యేప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా రైతుల వద్దకెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

విపత్తుల వేళ సర్కార్ దీమా కల్పిస్తుందా?
ఎరువుల రంగం వ్యవసాయంపై అత్యధిక ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభుత్వం దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నియంత్రిస్తుంది. ఈ రంగానికి ఇచ్చే సబ్సిడీలు కూడా వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సబ్సిడీలను మరింత పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం తీసుకొచ్చింది. దీనికింద ఎరువులను విక్రయించిన వారంలోగా ప్రభుత్వం ఆ కంపెనీలకు రాయితీలను బదిలీ చేస్తుంది. ఎటువంటి బకాయిలు లేకుండా చూసుకోవడం.. క్రమం తప్పకుండా కేటాయింపులు చేయడం వంటివి పథకానికి ముఖ్యం. లేకపోతే ఎరువుల కంపెనీలు ఖాయిలాపడి మొత్తం వ్యవసాయ రంగాన్ని ఇబ్బందుల పాల్జేస్తాయి. ముఖ్యంగా యూరియా, పాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ సంబంధిత ఎరువుల పై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. భూసార పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడం. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందేమో చూడాలి. ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాల్లో రైతులు అన్నివిధాలా నష్టపోతున్నారు. దీంతో అన్నదాతను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన' పథకాన్ని 2016-17లో దాదాపు 5.70 కోట్ల మంది రైతులు కొనుగోలు చేశారు. దీనిపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి. రుణాలు పొందే రైతులు కచ్చితంగా బీమా తీసుకునే విధంగా చేయగలిగితే చాలావరకు వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. ఈసారి బడ్జెట్‌లో దీని కేటాయింపులను రూ.13 వేల కోట్లకు పెంచే అవకాశం ఉంది.

నిస్సార భూములపై పరిశోధనలకు పెద్దపీట
2012-13 లెక్కల ప్రకారం అన్నదాత వార్షిక తలసరి ఆదాయం రూ.15వేలు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పేమీ లేదు. దీంతో 2016-17 బడ్జెట్లో ప్రభుత్వం 2022 నాటికి రైతు తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 70 శాతం మంది కౌలు రైతులే. వీరి వార్షిక తలసరి ఆదాయం రూ.6,067 మాత్రమే. అంటే నెలకు రూ. 505. ఇటువంటి వారు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, జార్ఖండ్‌లలో ఉన్నారు. వ్యవసాయానికి అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు. పంటల బీమా, రుణాలు, రాయితీపై విత్తనాలు వంటి ప్రయోజనాలేవీ వీరిని చేరకపోవడానికి వీటి అమలులో విధానపరమైన లోపాలను ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరవు, నిస్సార భూములు ఉన్న ప్రాంతాల్లోని రైతులకు వ్యవసాయ పరిశోధనలు అందించే ఫలాలెంతో ఉపయోగపడతాయి. ఈసారి ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనలకు 15శాతం నిధులను పెంచి రూ.8,000 కోట్లు కేటాయించవచ్చని భావిస్తున్నారు. బాగా వెనుకబడిన 150 జిల్లాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పరిశోధనలు నిర్వహించి అక్కడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి కేటాయించిన నిధుల్లో 90శాతానికి పైగా వినియోగించుకోవడం గమనార్హం.

తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ఓట్లు కురిపిస్తాయా?
గత నాలుగేళ్లుగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కేటాయింపుల్లో హస్వద్రుష్టి చూపిన కేంద్రం ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో నీటి పారుదల రంగానికి కేటాయించే నిధులను రూ.5.70 లక్షల కోట్లకు చేర్చాలని భావిస్తోంది. ఇందుకోసం సుమారు 70 శాతం నిధుల కేటాయింపును పెంచాలి. ఆరు ప్రధాన రాష్ట్రాల్లో చేపట్టిన కీలక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును పెంచాల్సి ఉంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం కూడా ఉంది. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిది. దీని నిర్మాణ బాధ్యతను తలకెత్తుతున్న బీజేపీ మిత్రపక్షం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకాల పేరిట గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసి, గతంలో వైఎస్ ప్రభుత్వం తవ్వించిన కాలువల ద్వారా క్రుష్ణా డెల్టాకు నీళ్లు మళ్లించి అదే నదుల అనుసంధానం అని తన అనుకూల మీడియా ద్వారా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ సమయం ఆగదుగా. నాలుగేళ్లు గిరుక్కున తిరిగిపోయాయి. మళ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే జూన్ లోగా కాఫర్ డ్యామ్‌ల నిర్మాణంతో గ్రావిటీపై కాలువలకు నీళ్లు మళ్లించి ఎన్నికల్లో మళ్లీ లబ్ది పొందాలని సీఎం చంద్రబాబు తలపోస్తున్నారు. కానీ కేంద్రం అడ్డుపుల్లలు, ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌టాయ్‌తో విభేదాలు ఇబ్బందికరంగా మారింది. ఇక తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై కాళేశ్వరం వంటి మహాత్తర పథకాల ప్రారంభానికి చర్యలు తీసుకున్నా.. ఎన్నికల నాటికి ఏ మేరకు పథకాలు పూర్తవుతాయన్నదీ అనుమానమే. వీటితోపాటు దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 75 కీలక ప్రాజెక్టులను పూర్తి చేస్తే నీటిపారుదల రంగం ముఖచిత్రం మారిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక నదుల అనుసంధానం వంటి బృహత్ ప్రణాళికలు ఉండనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications