పంట రుణ మాఫీ: సంక్లిష్ట సమస్యలకు దారి తీస్తుందా?
పదేపదే పంట రుణాలను మాఫీ చేయడం వల్ల రైతులు తాము తీసుకున్న రుణాలు వాయిదా వేయడానికి ప్రాధాన్యం ఇస్తారని బ్యాంకర్లు చెప్తున్నారు.
న్యూఢిల్లీ: అను నిత్యం పంట రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేస్తే.. రైతులు తాము తీసుకున్న పంట రుణాలు ఎగవేయడానికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఇస్తారని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కానీ అదే సమయంలో కార్పొరేట్ సంస్థలు పారిశ్రామిక ప్రగతి పేరిట తీసుకుంటున్న రుణాలతో లబ్ది పొందినా దివాళా తీశాయనే పేరిట లక్షల కోట్ల రుణాల మాఫీకి ప్రభుత్వాలు, బ్యాంకులు ముందుకు వస్తున్న నేపథ్యమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
యావత్ దేశానికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు పండించి అందుబాటులోకి తెచ్చే రైతులు.. వారి పట్ల ఆర్థిక నిపుణులు.. బ్యాంకర్లు మాత్రం ఆ రంగానికి పంట రుణాల మాఫీ ప్రతికూల పరిణామాలకు దారి తీస్తున్నదని చెప్తుండటం విచిత్ర పరిణామాలకు దారి తీస్తుందని పేర్కొనడం ఇబ్బందికరమే.

వ్యవసాయ ఆదాయం రెట్టింపవుతుందా?
కానీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వం 2022 నాటికి వ్యవసాయ రంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే అనునిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కరువు తాండవిస్తున్నది. ఈ తరుణంలో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలంటే రాజకీయ నిర్ణయమే కీలకం కానున్నది. ఇటీవల దేశీయంగా వివిధ ప్రాంతాల్లో నెలకొంటున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

అమలుపై యోగి ప్రభుత్వం ఇలా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పంట రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు నూతన బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. ఇదే తరుణంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం తమ రాష్ట్ర రైతుల పంట రుణాలు మాఫీ చేసేందుకు సహకరించాలని కోరుతూ గతవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలను అభ్యర్థించారు.

ఫడ్నవీస్‌పై శివసేన ఒత్తిడి
దేశంలోకెల్లా అత్యధికంగా కరువు సమస్యతో అస్తవ్యస్థంగా మారిన మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన ‘దేవేంద్ర ఫడ్నవీస్' సంకీర్ణ ప్రభుత్వంపై రుణ మాఫీ చేయాలన్న ఒత్తిడి రోజురోజుకు పెరుగుతున్నది. ప్రత్యేకించి అధికార కూటమి పక్షం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే పదేపదే డిమాండ్ చేస్తున్నారు. ఇదే బాటలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పంట రుణాలు మాఫీ చేసేందుకు సహకరించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఆందోళన బాట పడుతున్నాయి.

వ్యవసాయం వాటా 15%
భారతదేశంలోని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయం వాటా 15 శాతం. దేశ జనాభాలో మెజారిటీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్న వారే. వారి జీవన సరళిని కూడా వ్యవసాయమే నిర్దేశిస్తున్నది. కానీ భారత వ్యవసాయ రంగానికి రుణాల మాఫీ అమలు సరైన పరిష్కారమేనా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. భారీగా ఉన్న శక్తిమంతమైన రైతుల ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు స్వల్పకాలికంగా రాజకీయ పార్టీలకు రుణ మాఫీ పథకం ఒక అస్త్రంగా మారింది. కానీ దీర్ఘ కాలంలో వ్యవసాయ రంగానికి లబ్ది చేకూర్చేలా కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి.

ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి ఇలా
రుణ మాఫీ పొందుతున్న రైతులు పలు ప్రతికూల పరిణామాలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య మాట్లాడుతూ తరుచుగా పంట రుణాల మాఫీ వల్ల రుణ క్రమశిక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివాదాస్సద వ్యాఖ్య చేశారు. రాజకీయంగా దీన్ని ఎవరూ సీరియస్‌గా పరిగణించకపోయినా మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత మాత్రం ఆమెపై ప్రివిలైజ్ నోటీసు ఇచ్చారు

అరుంధతితోపాటు ప్రదీప్ చౌదరి
అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యలు రైతులను.. మహారాష్ట్ర అసెంబ్లీ హక్కులను కించ పరిచారని తన ప్రివిలైజ్ నోటీసులో పేర్కొన్నారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్య చేసిన బ్యాంకర్లలో ఆమె ఒక్కరే కాదు ఇతర బ్యాంకర్లు కూడా చేశారు. 2012లో ఎస్బీఐ చైర్మన్‌గా ఉన్న ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ ‘వ్యవసాయం ఒక చిన్న అంశం. 2008లో పంట రుణాల మాఫీతో నైతిక ప్రమాణాలకు విపత్తు తెచ్చి పెట్టింది' అని వ్యాఖ్యానించారు.

రుణ పరపతిపై రఘురాం రాజన్
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. వరుసగా పంట రుణాలు మాఫీ చేయడం వల్ల రుణ పరపతిపై, క్రెడిట్ మార్కెట్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2008 నాటి యూపీఏ ప్రభుత్వం అమలుచేసిన పంట రుణాల మాఫీ గుర్తు తెలియని పలు తీవ్ర పరిణామాలను తెచ్చి పెట్టిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

రుణ మాఫీపై ప్రపంచ బ్యాంక్ నివేదిక
భారత్‌లో పంట రుణాల మాఫీపై ప్రపంచ బ్యాంకుకు చెందిన మార్టిన్ కంచ్, జావియర్ గినె ‘ది ఎకనమిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ బారోవర్ బెయిలౌట్: ఎవిడెన్స్ ఫ్రం యాన్ ఎమర్జింగ్ మార్కెట్' అనే పేరుతో ఇచ్చిన నివేదిక ప్రకారం బ్యాంకులు ఇచ్చిన పంట రుణాల మాఫీ పథకం జిల్లాల నుంచి రైతుల వరకు గొప్ప ప్రభావం చూపిందని, మధ్య కాలికం నుంచి దీర్ఘ కాలికంగా పంటల దిగుబడిపై ప్రభావం చూపిందని, బ్యాంకులు ఎంపిక చేసిన రైతులకు మాత్రమే పంట రుణాలిచ్చేందుకు మొగ్గు చూపడానికి దారి తీసిందని పేర్కొంది. రుణ భారంతో రైతులు పంటలు సాగు చేసేందుకు పెట్టుబడులు పెట్టలేని దుస్థితిలో చిక్కుకున్నారని కూడా వారు ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో కూడా తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు గానీ, లేబర్ మార్కెట్ సానుకూల ప్రభావం గానీ చూపలేదని ఆ నివేదిక సారాంశం.

ఉద్దీపన అసాధ్యమంటున్న ప్రపంచబ్యాంకు
రుణ మాఫీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కల్పించాలని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వల్ల జిల్లాల వారీగా భారీ స్థాయిలో స్పందన లభించడం ఆశ్చర్యకరం కాదని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొన్నది. 2008లో భారతదేశంలో ప్రభుత్వం.. జాతీయ బ్యాంకులు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణభారం తగ్గించడం వల్ల ఎన్నికల వేళ రుణాల ఎగవేత క్రమంగా పెరిగిపోతున్నదని హార్వార్డ్ బిజినెస్ స్కూల్ - 2008 నివేదిక పేర్కొంది.

రుణ మార్కెట్ దెబ్బ తింటుందా?
తత్ఫలితంగా ప్రభుత్వాల రాజకీయ జోక్యం వల్ల రుణ మార్కెట్ దెబ్బ తింటున్నదన్నది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నివేదిక సారాంశం. పదేపదే రుణాల మాఫీ అమలు వల్ల రుణాల ఎగవేతతో దీర్ఘ కాలికంగా వ్యూహాత్మకంగా స్వయం సమ్రుద్ధి సాధించలేక ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని దాని సారాంశం. ఉత్తరప్రదేశ్‌లో పంట రుణాల మాఫీ పథకం అమలు సామర్థ్యం రూ.27,420 కోట్లు ఉంటుందని ఎస్బీఐ అంచనా. ఇది యూపీ రాష్ట్ర రెవెన్యూలో 8%.

ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని జైట్లీ
పంట రుణాల మాఫీ పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై పడుతుందని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంయుక్తంగా ద్రవ్యలోటుపై ప్రభావం చూపుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పేశారు. 2008లో పంట రుణాల మాఫీ వల్ల దేశవ్యాప్తంగా 3.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరగా, ప్రభుత్వ ఖజానాపై రూ.52 వేల కోట్ల భారం పడింది.

రుణ మాఫీ పరిష్కారం కాదంటున్న నిపుణులు
వ్యవసాయ రంగానికి ప్రభుత్వ మద్దతు అవసరమే గానీ పంట రుణాల మాఫీ పరిష్కారం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రుణ మాఫీ అమలు వల్ల వ్యవసాయ రంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గిపోనున్నది. సామూహిక పెట్టుబడులు అవసరమైన నీటి పారుదల, నీటి పొదరు, కొరత నివారణ, మార్కెట్‌తో అనుసంధానం, వ్యవసాయ పరిశోధనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెదుతున్నారు. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సమస్యలు సంస్థాగతమైనవే తప్ప దీర్ఘ కాలిక పరిష్కారం అవసరమైనవని, రుణ మాఫీ పథకం తద్వారా సంక్లిష్ట సమస్యలకు దారి తీస్తుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications