Holidays: స్కూళ్లకు 87 రోజులు సెలవులు, 229 రోజులు వర్కింగ్
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం (2026-27)కు సంబంధించిన ముసాయిదా అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వారి సలహాలను ఆహ్వానించింది. నూతన క్యాలెండర్ ప్రకారం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంబంధించిన కీలక మార్పులను విద్యాశాఖ ప్రతిపాదించింది.
ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు మొత్తం 87 సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఇవి కాకుండా ఐదు ఐచ్ఛిక సెలవులు (Optional Holidays), స్థానిక పండుగలు లేదా జాతరలకు ఇచ్చుకునేలా మరో మూడు స్థానిక సెలవులను కేటాయించారు.

ప్రధాన సెలవుల షెడ్యూల్:
- దసరా సెలవులు: సాధారణ పాఠశాలలకు అక్టోబరు 12 నుంచి 21 వరకు, మైనారిటీ పాఠశాలలకు అక్టోబరు 15 నుంచి ప్రారంభమవుతాయి.
- క్రిస్మస్ సెలవులు: సాధారణ పాఠశాలలకు డిసెంబరు 25 ఒక్కరోజే సెలవు ఉండగా, మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబరు 20 నుంచి 27 వరకు సెలవులు ఉంటాయి.
- సంక్రాంతి సెలవులు: 2027 జనవరి 11 నుంచి 17 వరకు సాధారణ పాఠశాలలకు, జనవరి 13 నుంచి 17 వరకు మైనారిటీ సంస్థలకు సెలవులు ఇస్తారు.
బోధన - పరీక్షల షెడ్యూల్
జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రవేశాల డ్రైవ్‌తో పాటు 'తరగతి సంసిద్ధత' (Class Readiness) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 1, 2, 6 తరగతుల విద్యార్థులకు 36 రోజుల పాటు, 3, 4, 5, 7, 8 తరగతుల వారికి 13 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం విద్యార్థులకు పుస్తకాల మోత లేకుండా 'నో బ్యాగ్ డే' నిర్వహిస్తారు.
ముఖ్యమైన పరీక్షల తేదీలు:
-
ఫార్మెటివ్ అసెస్‌మెంట్‌లు (FA): ఆగస్టు, అక్టోబరు, జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తారు.
-
సమ్మెటివ్ అసెస్‌మెంట్ (SA-1): నవంబరు 9 నుంచి 20 వరకు ఉంటుంది.
- పదో తరగతి పరీక్షలు: 2027 ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, మార్చి 15 నుంచి 31 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి.
- 1-8 తరగతుల సమ్మెటివ్-2: ఏప్రిల్ 3 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయుల పనిభారంపై నిబంధనలు
ఉపాధ్యాయుల పనిభారాన్ని క్రమబద్ధీకరించేలా విద్యాశాఖ మార్గదర్శకాలను ఇచ్చింది. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 నుండి గరిష్ఠంగా 30 బోధనా పీరియడ్లు తీసుకోవాలి. అవసరమైతే భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు గణితాన్ని కూడా బోధించాల్సి ఉంటుంది. పనిభారాన్ని సమతుల్యం చేస్తూ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది.














Click it and Unblock the Notifications