Fuel Hike: ఇది జస్ట్ శాంపిల్... రూ.28 మేర పెరగనున్న పెట్రో ధరలు?
భారత దేశంలో చమురు ధరల్ని కేంద్రం (Fuel hike) పెంచేసింది. ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం చెప్పిన మాటల్ని నిజం చేస్తూ చమురు కంపెనీల నష్టాల్ని తగ్గించాలన్న సాకుతో వాహన దారులకు చమురు ధరల మోత మోగించింది. పెట్రోల్ పై లీటరుకు 3 రూపాయలు, డీజిల్ పై 2 రూపాయలు పెంచేశారు. వీటిని ఇవాళ ఉదయం నుంచే అమల్లోకి కూడా తెచ్చేశారు. దీంతో వాహనదారులకు చుక్కలు కనిపించబోతున్నాయి.
అయితే ఇవాళ పెరిగిన ధరలు కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇకపై వరుసగా పెట్రో ధరల పెంపు ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత రూ. 3.08 పెంపు వాస్తవానికి దశలవారీ వ్యూహంలో భాగం కావచ్చని సమాచారం. ద్రవ్యోల్బణ భయాందోళనలను రేకెత్తించే ఒకే భారీ పెంపును విధించే బదులు, ప్రభుత్వం కాలక్రమేణా చిన్న చిన్న పెంపులను క్రమానుగతంగా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచ ముడి చమురు ధరలను పూర్తిగా చేరుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు చివరికి లీటరుకు రూ. 25-28 వరకు పెరగాల్సి రావచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ చేసిన ఒక సంచలనాత్మక అంచనా తర్వాత ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది.

హార్ముజ్ జలసంధికి సంబంధించిన అంతరాయాలు, విస్తృతమైన అమెరికా-ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలలో వచ్చిన భారీ పెరుగుదల ఆధారంగా ఈ అంచనా వేస్తున్నారు. అంతటి భారీ పెంపు తక్షణమే జరుగుతుందనడానికి ఎటువంటి సూచన లేనప్పటికీ, ప్రపంచ ముడి చమురు వాస్తవ పరిస్దితికీ, దేశీయ రిటైల్ ఇంధన ధరలకు మధ్య అంతరం ఎంత పెరిగిపోయిందో ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ చమురు సంక్షోభం యొక్క పూర్తి ఆర్థిక ప్రభావాన్ని భారతీయులు ఇంకా చూసి ఉండకపోవచ్చని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కూడా హెచ్చరించారు. సీఐఐ సదస్సులో మాట్లాడుతూ, ఇంధన రిటైలర్లు నష్టాలను భరిస్తున్నందున, పెరిగిన ముడి చమురు ధరల పూర్తి ప్రభావం నుండి భారతదేశం ఇప్పటివరకు తప్పించుకుందని కోటక్ అన్నారు. రాబోయే కఠినమైన ఆర్థిక పరిస్థితులకు దేశం సిద్ధంగా ఉండాలని కూడా ఆయన కోరారు. వ్యాపారాలు, విధాన రూపకర్తలు సిద్ధంగా ఉండాలని కోరుతూ, "ఆ షాక్ రాబోతోంది," అంటూ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications