ఏపీలో మరోసారి చమురు షాక్..! వినియోగదారులకు చుక్కలు..!
ఏపీలో మరోసారి పెట్రోల్, డీజిల్ సంక్షోభం (Fuel Crisis) తలెత్తేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటంతో వినియోగదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇంకొన్ని చోట్ల రెండు రోజులుగా చమురు కొరత ఉందని చెప్తున్నారు. చమురు కంపెనీలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడమే ఇందుకు కారణమని కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, సరఫరా ఇబ్బందులు కారణమని ఇంకొందరు చెప్తున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఉండవల్లి సెంటర్ వంటి కీలక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో 'నో డీజిల్' బోర్డులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, రైతులు బెంబేలెత్తిపోతున్నారు. బంకుల్లో నిల్వలు నిండుకోవడంతో ఉన్న కొద్దిపాటి స్టాక్‌ను కూడా సిబ్బంది రేషన్ పద్ధతిలో విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులకు 1000 రూపాయలకు మించి డీజిల్ పోసేది లేదని బంకు సిబ్బంది తెగేసి చెబుతున్నారు.

ఉన్న చోట కూడా పరిమితి విధిస్తుండటంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి, వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమైన రైతులకు గత్యంతరం లేకుండా పోతోంది" అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఇంధన కంపెనీల నుండి సరఫరాలో అంతరాయం ఉందా లేదా బంకు యజమానులే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఇంధన సంక్షోభంపై పౌర సరఫరా శాఖ మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications