మండే ఎండల వేళ పిడుగుల వర్షాలు- ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎండలు ఒక వైపు మండిపోతుంటే.. మరో వైపు అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుంటే, మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని ఈదురు గాలులతో వాతావరణం చల్లబడనుంది. పిడుగులు, బలమైన గాలుల తో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోని రాయలసీమ తో పాటుగా యానంలో ఏప్రిల్ 28, 29 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేవలం వానలే కాకుండా, ఆకాశం నుంచి పిడుగులు పడే ప్రమాదం ఉందని, పొలాల్లో ఉండే రైతులు, బయట తిరిగే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక తెలంగాణలో నేటి (ఏప్రిల్ 26) నుంచే ఈ ప్రభావం మొదలై 29వ తేదీ వరకు కొనసాగనుంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ
అదే విధంగా వర్ష సూచన ఉన్నప్పటికీ, పగటిపూట ఎండలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో గరిష్టంగా 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ వాసులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి నీరు ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ వేడి గాలులు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాగా, ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు ఇండియాలోకి ముందే ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. మే నెల చివరి వారంలోనే కేరళను రుతుపవనాలు తాకవచ్చు. అంటే గత ఏళ్ల కంటే త్వరగానే వానాకాలం మొదలై, భానుడి తాపం నుంచి మనకు విముక్తి కలగనుంది.












Click it and Unblock the Notifications