బండి భగీరథ్ పోక్సో కేసుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఏమన్నారంటే!
బండి భగీరధ్ పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ముమ్మరం చేసిన సిట్ బండి భగీరధ్ ను అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ కేసు గురించి జరుగుతున్న ప్రచారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మరోవైపు బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో బీజేపీ జోక్యం చేసుకోబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు స్పష్టం చేశారు.
బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన కిషన్ రెడ్డి
ఇదే సమయంలో తాజాగా బండి భగీరథ్ పోక్సో కేసులో కేంద్ర ప్రమేయం ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర పోలీసుల అధికార పరిధిలో ఉన్న విషయమని తెలిపారు. ఇప్పుడు విచారణ అంతా పోలీసుల చేతిలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

రైతుల ధాన్యం కల్లాల్లోనే ఉండటం బాధాకరం: కిషన్ రెడ్డి
ఇదిలాఉంటే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు పూర్తిగా ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉండటం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.
కేంద్రం మద్దతు ధర పెంచినా రాష్ట్రం కొనుగోళ్ళు చేయటం లేదు
తాజాగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం ఇటీవల వరి కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచినా రాష్ట్రంలో కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. యూపీఏ పాలనలో ధాన్యం క్వింటాల్‌కు రూ.1,300 ఉండగా, మోదీ ప్రభుత్వం దాన్ని రూ.2,360కు పెంచిందని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే భరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం కూడా లేదని స్పష్టం చేశారు.
రైతులకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం మీద బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రైతులు అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా జిల్లాల వారీగా వెళ్లి కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల సమస్యలు తీర్చాలని సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కిషన్ రెడ్డి చెప్పిందిదే
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక్కొక్కరికి రెండు-మూడు చోట్ల ఓట్లు ఉంటే గుర్తించి తొలగిస్తారని, ముఖ్యంగా రోహింగ్యాల ఓట్లు కచ్చితంగా తొలగించబడతాయని చెప్పారు. ఓట్ల ప్రక్షాళనను రాష్ట్ర అధికారులే చేపట్టారని, కేంద్రం కుట్ర చేస్తోందన్న ఆరోపణలు తప్పుడవని సవాల్ విసిరారు.
పెట్రోల్-డీజిల్ ధరలపై కౌంటర్
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో లేని విషయమని, అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. గతంలో ధరలు తగ్గినప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందని, రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కోరిందని గుర్తు చేశారు. తెలంగాణలోనే దేశంలో అత్యధిక వ్యాట్ విధించడం జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications