సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లలో ఏపీ టాప్!
దేశవ్యాప్తంగా నేరాల గణాంకాలను వెల్లడించిన NCRB-2024 నివేదికలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతున్న వేళ సైబర్ నేరాలు, హింసాత్మక ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 58.86 లక్షల గుర్తించదగిన నేరాలు నమోదయ్యాయి అని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 6% తగ్గుదలను సూచిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
బాగా పెరిగిన సైబర్ నేరాలు
అయితే సైబర్ నేరాలు బాగా పెరిగాయని పేర్కొంది. 2024 సంవత్సరంలో సైబర్ నేరాల కింద మొత్తం ఒక లక్ష ఒక వెయ్యి 928 కేసులు నమోదు కాగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. 2023 సంవత్సరంలో 86 వేల 420 సైబర్ నేరాలు నమోదైనట్లు వెల్లడించింది.

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ల కేసులో ఏపీ దేశంలోనే టాప్
NCRB నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 203 ఫేక్ న్యూస్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 139 కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం, అపోహలు, ద్వేషపూరిత పోస్టులు పెరుగుతున్నాయని నివేదిక సూచిస్తోంది.
ఏపీలో భారీగానే సైబర్ నేరాల కేసులు
అలాగే సైబర్ నేరాలు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరిగాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో 2,528 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి సుమారు 8 శాతం అధికమని NCRB వెల్లడించింది. ఆన్‌లైన్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి కేసులు అధికంగా నమోదైనట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో మొత్తం నమోదైన నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో
2024లో ఏపీలో మొత్తం 11,16,076 కేసులు నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా హింసాత్మక నేరాలు, మహిళలపై దాడులు, దోపిడీలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఇక మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలవడం మరింత కలవరపెడుతోంది. ఈ గణాంకాలు రాష్ట్రంలో నేర నియంత్రణ, సైబర్ భద్రత, సోషల్ మీడియా పర్యవేక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications