భారతదేశంలోనే 190కి.మీ ఓఆర్ఓర్ ఉన్న ఏకైక నగరంగా అమరావతి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో మరో విశేషం వెల్లడించారు. అమరావతిని భారతదేశంలోనే అత్యాధునిక, అతి పొడవైన ఔటర్ రింగ్ రోడ్ సౌకర్యం కలిగిన నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రి మరియు వైద్య విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణం కోసం భూమి పూజ చేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలోనే 190 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్ తో ఏకైక నగరం
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అయితే దేశంలోనే 190 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఏకైక నగరంగా అమరావతి నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతి, తెనాలి, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలను ఏకీకృతం చేసి అభివృద్ధి చేస్తే గుంటూరు జిల్లా దేశంలోనే అత్యుత్తమ జిల్లాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ప్లాన్
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 190 కి.మీల మేరకు నిర్మించనున్నారు. ఆరు వరుసల (6 లేన్ల) రహదారిగా రూపొందించే ఈ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి వేగం పుంజుకుంటుందని చంద్రబాబు వివరించారు.
అమరావతి భవిష్యత్ అవసరాల దృష్టితో రోడ్స్
తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వరకు లింక్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 23మండలాల పరిధిలో 121గ్రామాల నుంచి భూసేకరణ చేపట్టనున్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తున్నామని, విజయవాడ-అమరావతి మధ్య ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఆలోచనలో ఉందన్నారు.
దేశంలోనే అత్యాధునిక రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతి
ఈ రహదారి సౌకర్యాలు అమరావతిని దేశంలోనే అత్యాధునిక రాజధాని నగరాల్లో ఒకటిగా నిలబెట్టడంతో పాటు, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గతంలో తమ ప్రభుత్వ పాలనలో మొదలైన ఈ ఆలోచనలను మళ్లీ వేగంగా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.అమరావతి అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ కొత్త ప్రణాళికలు రాష్ట్ర రాజధాని ప్రాంతానికి కొత్త ఊపిరి పోస్తాయని చంద్రబాబు వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













Click it and Unblock the Notifications