JEE Advanced 2026: జేఈఈ పేపర్ల మధ్య స్కోర్లలో 100 మార్కుల తేడా..! ఐఐటీ రూర్కీ క్లారిటీ..!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced 2026) ఫలితాలు వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తమకు పేపర్ 1, పేపర్ 2 స్కోర్ల మధ్య 100 మార్కులకు పైగా భారీ వ్యత్యాసం ఉందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూల్యాంకన ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఐఐటీ రూర్కీ (IIT Roorkee)స్పందించింది. ఈ మార్కుల వ్యత్యాసానికి అక్రమాలు గానీ, మూల్యాంకన లోపాలు కానీ లేవని, గణాంక సూత్రాల ప్రకారం సహజమేనని స్పష్టం చేసింది.
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్సెడ్ ఫలితాలు విడుదలైన తర్వాత, అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్స్ లో తమ అనుభవాలను షేర్ చేశారు. ఇందులో ఒక విద్యార్థి పేపర్ 1లో -3 మార్కులు, పేపర్ 2లో 104 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఒకే రోజు, ఒకే సిలబస్‌తో పరీక్ష జరిగినప్పుడు ఇంత పెద్ద వ్యత్యాసం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి 100 మార్కులకు పైగా తేడాతో ఉన్న అనేక మార్కు షీట్లను ఇతర విద్యార్థులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పలువురు విద్యార్థులు అప్‌లోడ్ చేసిన స్కోరు బోర్డుల ప్రకారం, పేపర్ 1లో 97, పేపర్ 2లో 5 మార్కులు; పేపర్ 1లో 96, పేపర్ 2లో 25; పేపర్ 1లో 96, పేపర్ 2లో 30; పేపర్ 1లో 95, పేపర్ 2లో 20 మార్కులు వంటి వ్యత్యాసాలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో, ఈ తేడా 120 నుండి 129 మార్కుల వరకు ఉంది, దీనిపైనే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే నికుంజ్ గుప్తా అనే విద్యార్థికి ఐఐటీ రూర్కీ పంపిన ఈమెయిల్ రెస్పాన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో సుమారు 60వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలో రెండు పేపర్ల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం అసాధారణమేమీ కాదని ఐఐటీ పేర్కొంది. ఇది పూర్తిగా గణిత సంభావ్యతకు (mathematical probability) సంబంధించిన అంశమని, దీనిని అక్రమాలకు సాక్ష్యంగా భావించకూడదని ఐఐటీ స్పష్టం చేసింది. ఈ మార్కుల వ్యత్యాసం.. చీటింగ్, మూల్యాంకన తప్పులు, లేదా ఇతర అక్రమాలకు ఎటువంటి సాక్ష్యం కాదని ఐఐటీ రూర్కీ తేల్చిచెప్పింది. పరీక్షా ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ లేదా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని, గతంలో కూడా ఇలాంటి స్కోర్ గ్యాప్‌లు నమోదయ్యాయని ఐఐటీ రూర్కీ గుర్తుచేసింది.












Click it and Unblock the Notifications