తప్పు తెలుసుకున్నాను.. మారిపోయాను - చిరు చిన్నకూతురు వీడియో వైరల్ !!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల సాధారణంగా తన వ్యక్తిగత జీవితాన్ని మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతుంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలపై కూడా చాలా అరుదుగా స్పందించే ఆమె.. ఈసారి మాత్రం తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, మానసిక సంఘర్షణలు, వాటి నుంచి బయటపడిన విధానం గురించి ఓ భావోద్వేగ వీడియో ద్వారా మనసు విప్పారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, శ్రీజ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించిన పరిణామాలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశాయి. అయితే ఇప్పటివరకు వాటి గురించి బహిరంగంగా మాట్లాడని శ్రీజ, తొలిసారి తనలో జరిగిన మార్పును అభిమానులతో పంచుకున్నారు. 'నాకే ఎందుకిలా జరుగుతోంది?' అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నానంటూ ఆమె ఓపెన్ అయ్యారు.

వీడియోలో మాట్లాడుతూ.. శ్రీజ తన జీవితంలోని కఠినమైన దశలను గుర్తు చేసుకున్నారు. నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒక సమస్య పూర్తవకముందే మరో సమస్య ఎందుకు వస్తోంది? నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇంత మానసిక క్షోభను ఎదుర్కొంటున్నాను?" అనే ప్రశ్నలు చాలా కాలం తనను వెంటాడాయని ఆమె తెలిపారు.
తనను తాను బాధితురాలిగా భావిస్తూ చాలాకాలం గడిపానని, కానీ ఆ ఆలోచనా విధానం తన జీవితాన్ని మరింత భారంగా మార్చిందని చెప్పారు. అయితే ఒక దశలో తనలో పెద్ద మార్పు వచ్చిందని శ్రీజ వెల్లడించారు. "నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది? అని బాధపడటానికి బదులుగా, ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి? నేను ఇంకా ఎలా బలంగా మారగలను? అనే ప్రశ్నలు వేసుకోవడం ప్రారంభించాను. అదే నా జీవితంలో నిజమైన మార్పుకు నాంది పలికింది" అని ఆమె పేర్కొన్నారు.
'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్'తో కొత్త ప్రయాణం
తన జీవితంలో కీలకమైన మార్పుకు 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' కారణమైందని శ్రీజ వెల్లడించారు. ఆ ప్రయాణం తన ఆలోచనలను పూర్తిగా మార్చేసిందని చెప్పారు. "ఈ ప్రాజెక్ట్ ద్వారా నా గురించి నేను తెలుసుకోవడం ప్రారంభించాను. నా బలాలు, బలహీనతలు, భావోద్వేగాలను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది. గతంలో జరిగిన సంఘటనలు నన్ను నిర్వచించవని తెలుసుకున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
ఒకప్పుడు నా జీవితంలో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ణయిస్తాయని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది నిజం కాదని అర్థమైంది. బాధ అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే మొత్తం జీవితం కాదు. ప్రతి మనిషిలో ఎన్నో కోణాలు, ఎన్నో లేయర్లు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకోవడం ఒక అందమైన ప్రయాణం" అని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీజ వీడియోలో కేవలం తన అనుభవాలను మాత్రమే కాకుండా, జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఒక సానుకూల సందేశాన్ని కూడా అందించారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, మన ఆలోచనలను మార్చుకుంటే జీవితం కూడా మారుతుందని ఆమె చెప్పిన సందేశం పలువురిని ఆలోచింపజేస్తోంది.
శ్రీజకు మద్దతుగా అభిమానులు
ఇక సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు శ్రీజను అభినందిస్తున్నారు. "మీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి", "మీ మాటలు జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి", "ఎప్పుడూ ఇలాగే బలంగా ఉండాలి" అంటూ మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం శ్రీజ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications