ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై NHRC లో కేసు నమోదు
ఏపీలో పెట్రోల్ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్రంలో సగటున రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ విక్రయమౌతోంది. ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో పరిస్థితి తలకిందులైంది. పలు నగరాల్లో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిరీక్షించడం కనిపించింది. చాలా బంకుల్లో కొన్ని గంటల్లోనే పెట్రోల్, డీజిల్ ఖాళీ అయ్యాయి.
ఈ అంశం జాతీయ మానవ హక్కుల కమిషన్ కు సైతం చేరింది. కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేసేంత వరకూ వెళ్లిందీ పరిస్థితి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఈ కేసును నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం వల్ల అంబులెన్స్ లకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి నెలకొనడాన్ని ఇందులో ప్రస్తావించారు.

అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవలు, ప్రజా రవాణా, వ్యవసాయం, ఆహార సరఫరా రవాణా సజావుగా సాగడానికి పెట్రోల్, డీజిల్ అత్యవసరమని కేతిరెడ్డి గుర్తు చేశారు. అది లభించకపోవడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును హరించినట్టేనని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాలను పంపినట్లు తెలిపారు.
ఇంధన నిల్వల పారదర్శకత కోసం జిల్లా వారీగా అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వల వివరాలను వెల్లడించాలని ఆయన కోరారు. పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, సరఫరా మళ్లింపు, కృత్రిమ కొరత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా ఆటోమేటిక్ ట్యాంక్ గేజింగ్ వ్యవస్థ అమలు చేసి, కేంద్ర స్థాయి డిజిటల్ స్టాక్ మానిటరింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
పెట్రోల్ బంకుల వద్ద రియల్ టైమ్ స్టాక్ ను తెలియజేసే పోర్టల్ ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ కంప్లైంట్ వ్యవస్థ ప్రారంభించాలని పేర్కొన్నారు. నిరంతర సరఫరా, స్థానిక స్థాయిలో కట్టుదిట్టమైన పర్యవేక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాలు ఇవ్వాలని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications