NEET Paper Leak: ఒకేసారి 42 ప్రశ్నలు ఎలా కలిశాయి? మైండ్ బ్లోయింగ్ నిజాలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన విచారణను మరింత ముమ్మరం చేసింది. ఈ భారీ కుట్ర కేవలం బయటి వ్యక్తులకు పరిమితం కాదని, పరీక్ష నిర్వహణ వ్యవస్థలోని అంతర్గత వ్యక్తుల ప్రమేయం లేకుండా ఇంత పటిష్టమైన వ్యవస్థను ఛేదించడం అసాధ్యమని సీబీఐ బలంగా అనుమానిస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, నిల్వ, పంపిణీ వంటి అత్యంత గోప్యంగా ఉంచాల్సిన విభాగాల్లో పనిచేసే వారే ఈ లీకేజీకి సూత్రధారులుగా ఉన్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
మే 3న జరగాల్సిన పరీక్షకు ముందే పేపర్ బయటకు రావడంపై సీబీఐ లోతుగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి కీలక సమాచారాన్ని కోరింది. ప్రశ్నాపత్రం సీలు చేసే ముందు దానిని యాక్సెస్ చేసిన ప్రతి ఒక్కరి వివరాలు, సబ్జెక్ట్ నిపుణులు, ప్రొఫెసర్లు, అనువాదకులు, పరీక్షల తయారీ ప్యానెల్‌లోని సభ్యుల రికార్డులను అధికారులు జల్లెడ పడుతున్నారు. ప్రశ్నల రూపకల్పన నుంచి అనువాద ప్రక్రియ వరకు ప్రతి దశలోనూ గోప్యతా నిబంధనలు ఎలా ఉల్లంఘించబడ్డాయో అధికారులు ఆరా తీస్తున్నారు.

మహారాష్ట్రలో దర్యాప్తు మూలాలు
ఈ కేసులో మహారాష్ట్రలోని పుణె, లాతూర్ ప్రాంతాలు దర్యాప్తుకు కేంద్ర బిందువులుగా మారాయి. పుణెలో బ్యూటీ పార్లర్ నడిపే మనీషా వాఘ్మారే అనే మహిళను సీబీఐ అరెస్ట్ చేయడం కీలక మలుపుగా మారింది. ఆమె ఈ నెట్‌వర్క్‌లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, దాదాపు రెండు డజన్ల బ్యాంక్ ఖాతాల ద్వారా విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఆమెకు ఇప్పటికే అరెస్టయిన ధనంజయ్ అనే బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అనువాద ప్యానెల్ నుంచి లీక్?
నీట్ పరీక్ష 13 భాషల్లో జరుగుతుండటంతో, అనువాదకుల పాత్రపై సీబీఐ దృష్టి సారించింది. లాతూర్‌కు చెందిన ఒక రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. సదరు ప్రొఫెసర్ ప్రశ్నాపత్రాన్ని మరాఠీలోకి అనువదించే ప్యానెల్‌లో సభ్యుడిగా ఉండటంతో, అతనికి పూర్తి పేపర్ చూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. లాతూర్‌లోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నిర్వహించిన మాక్ టెస్ట్‌లో 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్‌తో సరిపోలడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఆ మాక్ టెస్ట్ పేపర్‌కు, లీకైన అసలు పేపర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని సీబీఐ నిశితంగా పరిశీలిస్తోంది.
దేశవ్యాప్త సోదాలు.. ఏడు రోజుల కస్టడీ
ఈ కేసును 'పెద్ద కుట్ర'గా అభివర్ణించిన సీబీఐ, దర్యాప్తులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటివరకు అరెస్టయిన ఏడుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కస్టడీ విచారణలో లీకేజీ మూలాలతో పాటు, దీని వెనుక ఉన్న మరికొంతమంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కేసులో దోషులను వదిలే ప్రసక్తే లేదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications