పంతం నెగ్గించుకున్న రఘురామ..! ఎట్టకేలకు ఆకివీడులో తొలి అడుగు..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (raghurama krishnam raju) ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. తన నియోజకవర్గం ఉండి పరిధిలోకి వచ్చే ఆకివీడులోని పెద్దపేటలో ఉన్న గొంతెనమ్మ ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్చి, దాని స్ధానంలో రామాలయ నిర్మాణం చేపట్టేందుకు రఘురామ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. రోడ్డుపై గొడవల నుంచి హైకోర్టు వరకూ వెళ్లిన ఈ వ్యవహారంలో ఎట్టకేలకు రఘురామ తొలి అడుగు వేశారు.
ఇవాళ ఆకివీడు పెద్దపేటలో రామాలయ నిర్మాణానికి రఘురామకృష్ణంరాజు శంఖుస్థాపన చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో శాస్త్రోక్తంగా రామాలయ నిర్మాణానికి రఘురామరాజు రాయి వేశారు. అనంతరం పూజలు నిర్వహించారు. త్వరలో ఇక్కడ భవ్యమైన రామాలయ నిర్మాణం జరుగుతుందని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.

అంతకు ముందు ఇక్కడ ఉన్న గొంతెనమ్మ ఆలయం కూల్చి వేతకు నిరసనగా స్థానిక దళితులు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా దాడులకు దిగారని దళితులపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ప్రభుత్వం కూడా స్పందించాల్సి వచ్చింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాల నిర్మాణం సరికాదంటూ దళితులు హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం స్వయంగా అనుమతులు మంజూరు చేయడంతో రామాలయ నిర్మాణం విషయంలో అడ్డంకులు తొలగిపోయాయి.














Click it and Unblock the Notifications