శ్రీవారి చెంతకు చేరేదెలా?
ఏపీలో పెట్రోల్ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు క్యూలో నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్రంలో సగటున రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ విక్రయమౌతోంది. ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో పరిస్థితి తలకిందులైంది. శనివారం ఒక్కరోజే పెట్రోల్ 10,345 కిలోలీటర్లు, డీజిల్ 14,156 కిలోలీటర్లకు పైగా విక్రయం అయ్యాయి. దీంతో డిమాండ్ 50 శాతానికి పైగా పెరిగింది.
పలు నగరాల్లో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిరీక్షించడం కనిపించింది. చాలా బంకుల్లో కొన్ని గంటల్లోనే పెట్రోల్, డీజిల్ ఖాళీ అయ్యాయి. ఇది వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించింది. ఈ పరిణామాలు రవాణా, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆధారపడిన వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, అనవసర కొనుగోళ్లను మానుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, కర్నూలు వంటి ప్రధాన పట్టణాల్లోని కొన్ని పనిచేస్తున్న పంపుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు సాధారణ దృశ్యంగా మారాయి. అనేక ఇంధన కేంద్రాలు "నో స్టాక్" బోర్డులు వెలిశాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మరిన్ని బంక్‌లు మూతపడ ప్రమాదం లేకపోలేదు. సరఫరాలో అంతరాయం లేదని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇదే కొరత తిరుమలను కూడా తాకింది గానీ అది తాత్కాలికమే అయింది. తిరుమలలో ఇంధన కొరత లేదని భక్తులకు టీటీడీ స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హిందూస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంకులు ఖాళీ అయ్యాయి. దీంతో అక్కడ కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు. సాయంత్రానికి హెచ్ పీ పెట్రోల్ బంక్ కు ఓ ట్యాంకర్ చేరుకుంది. ఈ ఉదయానికి ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ కు కూడా ట్యాంకర్ చేరుకుంటుందని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.












Click it and Unblock the Notifications