అధవ్ అర్జున ఒక్కడే కాదు- అత్త, బావమరిది కూడా
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఏఐఏడీఎంకే- 73, డీఎంకే- 53 స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
టీవీకే విజయంలో కీలక పాత్ర పోషించారు అధవ్ అర్జున. పార్టీ ప్రారంభం నుంచీ విజయ్ వెన్నంటే ఉంటూ వస్తోన్నాడు. అత్యంత కీలకమైన విల్లివాక్కం నుంచి 17,302 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరీ అధవ్ అర్జున అనే ప్రశ్నలకు తెర తీసింది.

లాటరీ కింగ్ గా పేరుపొందిన శాంటియగో మార్టిన్ అల్లుడు అధవ్ అర్జున. శాంటియాగో మార్టిన్ కుమార్తె డైసీ మార్టిన్ ను పెళ్లాడారు. శాంటియగో మార్టిన్ భార్య, అధవ్ అర్జున అత్త లీమా రోజ్ మార్టిన్.. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థిగా లాల్గుడి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తమిళనాడులో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్. ఎన్నికల అఫిడవిట్ లో 1,045 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని చూపారు. ఏఐఏడీఎంకే టికెట్‌పై పోటీ చేసిన లీమా రోజ్.. డీఎంకే, టీవీకే అభ్యర్థుల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ 2,500 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు.
అక్కడితో ఆగలేదు. శాంటియగో మార్టిన్ కుమారుడు జోస్ ఛార్లెస్ మార్టిన్ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. పుదుచ్చేరి నుంచి ఆయన విజయం సాధించారు. లక్ష్య జననాయక కచ్చి పార్టీ వ్యవస్థాపకుడు కూడా. ఆ పార్టీ అభ్యర్థిగా పుదుచ్చేరి కామరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జోస్ ఛార్లెస్ పోటీ చేశారు. 10,205 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటోందీ పార్టీ.
తమిళనాడులో లాటరీలపై నిషేధం ఉన్నప్పటికీ శాంటియాగో మార్టిన్ 'ఫ్యూచర్ గేమింగ్' సంస్థ ద్వారా రమ్మీ వంటి పలు ఆన్ లైన్ గేమ్ లల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆధవ్ అర్జున 2021 అసెంబ్లీ ఎన్నికల ముందు వాయిస్ ఆఫ్ కామన్ సంస్థ ద్వారా డీఎంకే కోసం పనిచేశారు. అనంతరం విదుతలై చిరుతైగల్ కచ్చీలో చేరారు. ఆ తర్వాత అక్కడి నుండి బయటకొచ్చి విజయ్ తో జట్టుకట్టారు. టీవీకేలో నంబర్ 2 గా ఎదిగారు.












Click it and Unblock the Notifications