పెళ్లాం ఆ మాట అంటే తప్పు లేదు.. హైకోర్టు సంచలన తీర్పు!
వైవాహిక బంధాలు, చట్టపరమైన వివాదాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఓ కీలక తీర్పును వెలవరించింది. భార్య తన భర్తను నపుంసకుడు అని పిలవడం లేదా ఆరోపించడం పరువ నష్టం కిందికి రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సదరు భార్య చేస్తున్న ఆరోపణలకు సరైన మెడికల్ రిపోర్టులు లేదా ఆధారాలు ఉన్నప్పడు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించి మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సదరు దంపతులకు నవంబర్ 25, 2022న వివాహం జరిగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత 2024లో భర్త శారీరక సామర్థ్యం లోపించడం, అనారోగ్య కారణాల వల్ల వారి వివాహ బంధం సాకారం కాలేదని భార్య పేర్కొంది. దీనిపై ఆమె గృహహింస, కట్నం వేధింపుల చట్టాల కింద క్రిమినల్ చర్యలు ప్రారంభించింది. దీనికి ప్రతిచర్యగా భర్త తన భార్య సమాజంలో తన ప్రతిష్టను దిగజార్చేలా నపుంసకుడిగా చిత్రీకరిస్తోందని గోరఖ్‌పూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఆ ట్రయల్ కోర్టు 2024 డిసెంబర్ లో భార్యకు సమన్లు జారీ చేయగా.. ఆమె దానిని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు కేసు వాస్తవాలను, పరిస్థితులను సరిగ్గా పరిశీలించకుండానే సమన్లు జారీ చేసిందని తప్పుపట్టింది. భార్య చేసిన ఆరోపణలు కేవలం భర్తను అవమానించడానికి చేసినవి కావు అని.. ఆమె భర్త మెడికల్ రిపోర్టుల ఆధారంగానే ఆ కామెంట్స్ చేసిందని హైకోర్టు గుర్తించింది. మహిళ ఈ కామెంట్లను ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ చట్టపరమైన ఫిర్యాదులో భాగంగానే పేర్కొందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో ఓ ముఖ్యమైన చట్టపరమైన అంశాన్నిస్పష్టం చేసింది. ఎటువంటి కాంక్రీట్ వైద్య ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని బహిరంగంగా నపుంసకుడు అని పిలిస్తే అది ప్రాథమికంగా పరువు నష్టం కిందికే వస్తుందని పేర్కొంది. "అయితే, ఇటువంటి ఆరోపణలను చట్టబద్ధమైన ఫిర్యాదు లేదా చట్టపరమైన విచారణలో భాగంగా, సమర్థుడైన అధికారి ముందు సద్భావనతో చేసినప్పుడు.. అది భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 499 లోని మినహాయింపు కింద రక్షణ పొందుతుంది" అని కోర్టు వెల్లడించింది.
అంతేకాకుండా.. సదరు మహిళ విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు ప్రస్తావించింది. పెళ్లి జరిగిన తర్వాత లైంగికంగా కలవకపోవడం, దానికి తగిన వైద్య పరీక్షల నివేదికలు ఉన్నట్లయితే, దానిని విడాకులు మంజూరు చేయడానికి బలమైన ఆధారంగా పరిగణించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. భార్య చేసిన ఆరోపణలు భర్తను గాయపరచాలనే దురుద్దేశంతో చేసినవి కావు కాబట్టి, ఆమెపై ఉన్న పరువు నష్టం కేసును కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు తుది తీర్పునిచ్చింది.












Click it and Unblock the Notifications