మహాసముద్రాలనే ఈదేశి.. 15 వేల కిలోమీటర్లు ప్రయాణం
భూమ్మీద ఉన్న జీవులన్నింటిలోకి మహాసముద్రాల అంతరాలలో జీవించే తిమింగలాల జీవన శైలి అత్యంత విలక్షణమైనది, అద్భుతమైనది. ఆహారం కోసమో, సంతానోత్పత్తి కోసమో ఇవి వేల కిలోమీటర్లు వలస వెళ్తుంటాయని మనకు తెలుసు. కానీ, తాజాగా రెండు హంప్‌బ్యాక్ (Humpback) తిమింగలాలు చేసిన ప్రయాణం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలే నోరెళ్లబెడుతున్నారు. ఊహకందని రీతిలో ఆస్ట్రేలియా నుంచి బ్రెజిల్ వరకు ఏకంగా 15,000 కిలోమీటర్ల (సుమారు 9,300 మైళ్లు) దూరం ప్రయాణించి ఈ జలచరాలు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి. ఇప్పటివరకు ఏ హంప్‌బ్యాక్ తిమింగలం కూడా సముద్రంలో ఇంత సుదూర ప్రయాణం చేయలేదు.
"ఇదొక అత్యంత అరుదైన, అద్భుతమైన సంఘటన. ఈ జీవులు సముద్రంలో ఎంత విస్తృతమైన ప్రదేశాల్లో సంచరించగలవో, వాటి సామర్థ్యం ఏపాటిదో ఈ ప్రయాణం నిరూపించింది" అని నోవా (NOAA) తిమింగల పరిశోధన విభాగం మాజీ అధిపతి ఫిలిప్ క్లాప్‌హామ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తోక గుర్తుల ఆధారంగా గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు
సముద్ర గర్భంలో ఉండే తిమింగలాల కదలికలను ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని. అయితే, గత నాలుగు దశాబ్దాలుగా పరిశోధనా బృందాలు, పౌర శాస్త్రవేత్తలు సేకరించిన 19,000 కంటే ఎక్కువ తిమింగలాల చిత్రాలను విశ్లేషించి పరిశోధకులు ఈ గుట్టు విప్పారు. ప్రతి హంప్‌బ్యాక్ తిమింగలానికి దాని తోకపై మనుషుల వేలిముద్రల (Fingerprints) లాంటి ప్రత్యేకమైన నమూనాలు, గుర్తులు ఉంటాయి. అత్యాధునిక గుర్తింపు సాఫ్ట్‌వేర్ సాయంతో ఈ తోకల నమూనాలను స్కాన్ చేసినప్పుడు శాస్త్రవేత్తలకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిశాయి.
తూర్పు ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లోని సంతానోత్పత్తి కేంద్రాల వద్ద కనిపించిన రెండు వేర్వేరు తిమింగలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో పయనిస్తూ ఈ సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణించాయని స్పష్టమైంది. అందులో ఒక తిమింగలం ఏకంగా 15,000 కిలోమీటర్లకు పైగా ఈదుకుంటూ వెళ్లి, గతంలో కొలంబియా నుండి జాన్సిబార్ వరకు నమోదైన పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది.
ఆహార వేటలో దారి తప్పాయా?
సాధారణంగా హంప్‌బ్యాక్ తిమింగలాలు తమ తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న వలస మార్గాలనే పాటిస్తాయి. ఇవి వేసవి కాలంలో క్రిల్ (చిన్న రొయ్యల లాంటి జీవులు), చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటూ, శీతాకాలంలో ఉష్ణమండల జలాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. అయితే, ఆస్ట్రేలియా, బ్రెజిల్ లాంటి వేర్వేరు సంతానోత్పత్తి ప్రాంతాల మధ్య ఇవి ఎందుకు ప్రయాణించాయనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.
పసిఫిక్ వేల్ ఫౌండేషన్ సహ రచయిత్రి స్టెఫానీ స్టాక్ దీనిపై స్పందిస్తూ.. ఇవి సముద్రంలో ఉమ్మడిగా ఆహారం దొరికే చోట ఇతర తిమింగలాల గుంపులను కలిసి ఉండవచ్చని, ఆ తర్వాత తమ సొంత నివాసాలకు తిరిగి వెళ్లకుండా దారి తప్పి విడిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఖండాంతర ప్రయాణాలు తిమింగలాల సరిహద్దుల అవగాహనపై శాస్త్రవేత్తల అంచనాలను సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధగోళంలో పెద్ద పెద్ద ఖండాలు ఉండటం వల్ల అక్కడి తిమింగలాలకు ఇటువంటి ప్రయాణాలు కష్టం కానీ, దక్షిణార్ధగోళంలో ఇవి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి.
పర్యావరణ మార్పులపై హెచ్చరిక
మంగళవారం ప్రతిష్టాత్మక "రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్" జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ రికార్డు ప్రయాణం తిమింగలాల అపారమైన ఈత సామర్థ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా పర్యావరణవేత్తలకు ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాలు వేడెక్కుతుండటంతో తిమింగలాలకు ప్రధాన ఆహారమైన క్రిల్ నివాసాలు, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో, తిమింగలాల వలస మార్గాలను ట్రాక్ చేసే ఇటువంటి సరికొత్త సాంకేతిక పద్ధతులు భవిష్యత్తులో వాటి కదలికలను పర్యవేక్షించడానికి, అంతరించిపోకుండా వాటిని పరిరక్షించడానికి ఎంతగానో సహాయపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications