విజయ్ కు ఊహించని మద్దతు, మారుతున్న లెక్కలు- ఇక నెక్స్ట్..!!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో సారి గవర్నర్ ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, 118 మంది ఎమ్మెల్యే ల మద్దతు పై స్పష్టత ఇవ్వాలని గవర్నర్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో.. మరో ఆరుగురు ఎమ్మెల్యే ల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలు పట్టం కట్టినా.. సీఎం గా ప్రమాణ స్వీకారం ఆలస్యం పైన పలువురు స్పందిస్తున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.
తమిళనాడు లో 108 స్థానాల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన టీవీకే కు ప్రభుత్వ ఏర్పాటు సమయం లో కష్టాలు వెంటాడుతున్నాయి. నెంబర్ గేమ్ లో భాగంగా ఇంకా ఆరుగురు మద్దతు విజయ్ కు ఇప్పుడు అవసరం గా మారుతోంది. రెండో సారి గవర్నర్ ను కలిసి మద్దతు ఇవ్వాలని విజయ్ కోరినా.. గవర్నర్ తన మాటకే కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే 118 మంది మద్దతు పైన స్పష్టత రావాలని స్పష్టం చేసారు. ఈ సమయంలో విజయ్ కు మద్దతుగా పలువురు ప్రముఖులు.. పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. వీసీకే చీఫ్ తొల్ తిరుమావళవన్ గురువారం గవర్నర్‌ను కలిసి, అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీవీకేకు ప్రజలు అతిపెద్ద పార్టీగా తీర్పు ఇచ్చారని... అందువల్ల విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని సూచించారు. మెజార్టీ ఉందా లేదా అన్నది అసెంబ్లీలో తేలాలన్నారు. గవర్నర్ ముందుగానే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపాలని అడగడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. అదే విధంగా సీపీఐ ఇదే తరహా అభిప్రాయంతో ఉంది.

విజయ్ కు మద్దతుగా కమల్ హాసన్
గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ కోరింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ముందుగా అవకాశం ఇవ్వాలని... ప్రమాణ స్వీకారం కంటే ముందే మెజార్టీ నిరూపించాలని అడగడం తగదని సీపీఐ పేర్కొంది. అందువల్ల గవర్నర్ వెంటనే టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని డిమాండ్ చేసింది. సీపీఎం ఇదే విధమైన డిమాండ్ చేసింది. ఇక.. సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమిళనాడు ప్రజలు ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదని, కానీ టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలబెట్టారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితిలో విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పును అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కమల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.













Click it and Unblock the Notifications