ఓట్లు చీల్చిన సూపర్ స్టార్స్.. ఎన్టీఆర్ ‘ప్రభంజనం’
వెండితెర వెలుగుల నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన నటులకు దక్షిణాది ఓటర్లు ఎప్పుడూ ఒక పట్టాన అర్థం కారు. కొందరిని సింహాసనంపై కూర్చోబెడితే, మరికొందరికి కనీస ఓటు షేర్ కూడా ఇవ్వకుండా షాక్ ఇచ్చారు. నిన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక, ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఇప్పుడు అందరి దృష్టి 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్‌పైనే ఉంది. ఈ క్రమంలో గత సినీ దిగ్గజాల రికార్డులు మరోసారి తెరపైకి వచ్చాయి.

ఎన్టీఆర్ 'ప్రభంజనం'.. కమల్ 'నిరాశ'
తొలి ఎన్నికల్లోనే అత్యధిక ఓటు షేర్ సాధించిన రికార్డు ఇప్పటికీ నందమూరి తారకరామారావు పేరు మీదనే ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న నేతల గణాంకాలు ఇలా ఉన్నాయి.
- ఎన్టీఆర్ (TDP): 46.30% - రెండు దశాబ్దాల కాంగ్రెస్ పాలనను 9 నెలల్లోనే కూల్చివేసి ప్రభంజనం సృష్టించారు.
- ఎంజీఆర్ (AIADMK): 33.52% - కరుణానిధికి ధీటుగా ఎదిగి తమిళ రాజకీయాలను తనవైపు తిప్పుకున్నారు.
- చిరంజీవి (PRP): 16.38% - సీట్ల పరంగా నిరాశపర్చినా, గణనీయమైన ఓటు షేర్ సాధించి రెండు పార్టీల గెలుపోటములను శాసించారు.
- విజయ్ కాంత్ (DMDK): 8.38% - కింగ్ మేకర్‌గా ఎదిగి ఆ తర్వాత ప్రతిపక్ష నేత స్థాయికి చేరుకున్నారు.
- పవన్ కళ్యాణ్ (JSP): 5.53% - 2019 తొలి పోరులో ఆశించిన మేర ఓట్లు రాబట్టలేకపోయారు. కానీ కూటమితో జత కట్టి ప్రస్తుతం 100 శాతం స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతున్నారు.
- కమల్ హాసన్ (MNM): 2.62% - మేధావుల పార్టీగా ముద్ర పడి ఓటు షేర్ లో వెనుకబడ్డారు.
విజయ్ ఎంత చీలుస్తారు?
నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 'దళపతి' విజయ్ ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పైన పేర్కొన్న గణాంకాలను గమనిస్తే.. ఎంజీఆర్ తరహాలో 30 శాతానికి పైగా సాధిస్తారా? లేక చిరంజీవి తరహాలో 15-18 శాతం మధ్య ఓట్లు చీల్చి డీఎంకే, ఏఐడీఎంకే కూటములకు ముచ్చెమటలు పట్టిస్తారా? అన్న చర్చ మొదలైంది.
విజయ్ ప్రధానంగా యువత ఓట్లపై కన్నేశారు. ఒకవేళ విజయ్ 10 శాతం కంటే ఎక్కువ ఓట్లు చీల్చగలిగితే, అది తమిళనాడులో సంప్రదాయ రాజకీయ సమీకరణాలను తలకిందులు చేయడం ఖాయం. అజిత్ వంటి ఇతర హీరోల అభిమానుల ఓట్లు, తటస్థ ఓటర్లు ఎటు మొగ్గారనే దానిపైనే విజయ్ 'రాజకీయ వారసుడా' లేక కేవలం 'ఓట్ల చీలికదారికా' అనేది మే 4న తేలనుంది.












Click it and Unblock the Notifications