బిగ్ ఝలక్- రాఘవ్ ఛద్దా ఒక్కడే కాదు..ఆ ఏడుమందీ ఇకపై
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడానికి రాజ్యసభ సభాపతి ఆమోదం తెలిపారు. ఈ ఏడుమందిలో రాఘవ్ ఛద్దా కూడా ఉన్నారు. ఈ పరిణామంతో రాజ్యసభలో బీజేపీ బలం 106 నుంచి 113కి పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 10 నుంచి మూడుకు పడిపోయింది. ఇదివరకు రాఘవ్ ఛద్దా తనతోపాటు ఆరుగురు ఆప్ రాజ్యసభ సభ్యులతో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. మొత్తం ఎన్డీఏ సభ్యుల సంఖ్య 148కి చేరింది.
రాజ్యసభలో తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తోన్నట్లు అప్పట్లోనే ప్రకటించారు రాఘవ్ ఛద్దా. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాజ్యసభ సెక్రెటేరియట్, ఛైర్మన్ ఛాంబర్ కు పంపారు. తాజాగా వీటిపై ఛైర్మన్ ఆమోదం తెలిపారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మాలివాల్ ఇక ఆప్ నుండి నిష్క్రమించినట్టయింది. బీజేపీలో వారి చేరిక లాంఛనంగా ముగిసింది.

మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తన సిద్ధాంతాలు, విలువలు, నైతిక సూత్రాల నుండి పక్కకు తప్పుకొందనేది వారి ఆరోపణ. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక పార్టీ మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతులకు పైగా మరొక పార్టీలో విలీనం కావడానికి అనుమతి ఉంది. దీనికి లోబడి రాఘవ్ ఛద్దా తన పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. బీజేపీలో చేరిన వారిలో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మాలివాల్ ఒక్కరే కాగా, మిగిలిన ఎంపీలందరూ పంజాబ్ నుండి ఎన్నికైనవారు.
ఏడుగురు ఆప్ ఎంపీల విలీనంతో బీజేపీకి భారీగా ప్రయోజనం చేకూరింది. ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోయిందనే ప్రచారం జరుగుతోంది. పంజాబ్‌లోని పలువురు కీలక నేతలు రాఘవ్ చద్దాతో సంప్రదింపుల్లో ఉన్నారని, వారందరూ కూడా పార్టీ వీడే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.
Rajya Sabha Chairman accepts merger of Raghav Chadha and six other MPs who quit Aam Aadmi Party, with the BJP. pic.twitter.com/eOOq1Xznjy
— Press Trust of India (@PTI_News) April 27, 2026
వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాఘవ్ ఛద్దాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఆప్ లో చీలిక వార్తలను ఎంపీ సంజయ్ సింగ్ ఖండించారు. బీజేపీ, రాఘవ్ ఛద్దా ఉద్దేశపూర్వకంగా ఈ వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఛద్దా, ఇతర బీజేపీ ఎంపీల విశ్వాస ఘాతుకానికి వ్యతిరేకంగా పంజాబ్ అంతటా నిరసనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications