విజయ్ కు దూరం అవుతున్న ముఖ్యమంత్రి పీఠం..!? ఊహించని రాజకీయం - డెడ్ లైన్...!!
తమిళనాడులో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్దం అవుతున్న వేళ ఒక్క సారిగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. మెజార్టీకి అవసరమైన సంఖ్యా బలం ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇస్తామని గవర్నర్ మెలిక పెట్టారు. సభలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ చేసిన అభ్యర్ధనను తోసి పుచ్చారు. దీంతో.. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం రద్దయింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు.. మెజార్టీ పై రేపటి లోగా స్పష్టతతో రావాలని విజయ్ కు గవర్నర్ సూచించినట్లు సమాచారం.
తమిళనాడు ఎన్నికల్లో 'విజిల్' మోత మోగించిన ఇళయ దళపతి విజయ్‌కు ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరమవుతోందా? ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. త్రిముఖ పోరు జరిగి, ఏ పార్టీకీ మ్యాజిక్ మార్క్ దక్కకపోవడంతో త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న తమిళనాడు రాజకీయ చిత్రం అనూహ్యమైన మలుపు తిరుగుతోంది. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 234. అధికార సాధనకు కనీసం 118 సీట్లు కావాలి. కానీ... టీవీకే 108తో ఆగిపోయింది. విజయ్‌కి ఇప్పటిదాకా ఐదుగురు సభ్యుల బలమున్న కాంగ్రెస్ మాత్రమే అధికారికంగా మద్దతు ఇచ్చింది.

అంటే... ఇంకా ఆరుగురు సభ్యులు తక్కువగా ఉంది. రెండు కూటముల్లో ఏదో ఒకదానిలో భాగస్వాములుగా ఉన్న పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), డీఎండీకే (1), ఏఎంఎంకేఎంఎన్‌కేజడ్ (1) పార్టీలన్నింటికీ కలిపి... 14 సీట్లున్నాయి. అయితే, డీఎంకే- అన్నా డీఎంకే పొత్తు పైన జరిగిన ప్రచారాన్ని డీఎంకే ఖండించింది. అలాంటి ప్రయత్నాలు చేయటం లేదని తేల్చి చెప్పింది. ఇక.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ ఆయనకు సూచించడంతో గురువారం ప్రమాణ స్వీకారం రద్దయింది.
క్షణ క్షణం మారుతున్న రాజకీయం
గవర్నర్ తో విజయ్ భేటీ సమయంలో తమ పార్టీకి ఉన్న మద్దతు లెక్కలు అందించారు. కాంగ్రెస్ మద్దతు పైన స్పష్టత ఇచ్చారు. ఇంకా ఆరుగురు మద్దతు పైన గవర్నర్ ఆరా తీసారు. సమయం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ చెప్పారు. కాగా.. ఈ పరిణామాల పైన గవర్నర్ న్యాయ సలహా తీసుకున్నారు. పూర్తి మెజార్టీ లెక్కలు పంపాలని లోక్ భవన్ నుంచి టీవీకే నేతలకు సమాచారం అందింది. వెంటనే ఈ సంఖ్య పైన స్పష్టత రాకపోవటంతో.. ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దు చేసుకున్నారు.
తొలుత విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వామపక్షాలు ఆ తరువాత తాము డీఎంకే తోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఐఎంయూ ఎల్ సైతం తాము విజయ్ కు మద్దతు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో.. మరో రెండు పార్టీల నేతలతో టీవీకే చర్చలు చేస్తుంది. పీఎంకే, సీవీకే నుంచి మద్దతు వస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం అవుతుంది. ఇటు గవర్నర్ మెజార్టీ పై రేపు (శుక్రవారం) సాయంత్రం లోగా తేల్చాలని డెడ్ లైన్ విధించటంతో తమిళనాడు రాజకీయం ఉత్కంఠ గా మారుతోంది.













Click it and Unblock the Notifications