తమిళనాడు రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. అత్యంత ధనిక ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జరుగుతోంది. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్.. స్వతహాగా మాస్ హీరో కావడం వల్ల ఆయనకు ఉన్న ఆస్తుల గురించి ఓ అవగాహన ఉంది. ఆయనను మించిన ఆస్తిపరులు, ధనవంతులు ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి గెలిచారు. శాసన సభలో అడుగు పెట్టబోతున్నారు. విజయ్ తో పాటు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కూడా ఆస్తిపరులే.
వీరందరికీ మించి లీమా రోజ్ మార్టిన్ కు ఉన్న ఆస్తులే అధికం. ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా పోటీ చేశారు. తమిళనాడు రిచ్చెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో లీమా రోజ్ మార్టిన్ టాప్ లో ఉన్నారు. తమిళనాట లాటరీ కింగ్ గా పేరుపొందిన ప్రముఖ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్.

ఆమె కుటుంబానికి ఉన్న ఆస్తులు 5,863 కోట్ల రూపాలకు పైమాటే. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే లీమా రోజ్ పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 1,049.50 కోట్ల రూపాయలు. టీవీకేలో నంబర్ టూగా వెలుగొందుతున్న ఆధవ్ అర్జున.. స్వయానా ఆమె అల్లుడు. శాంటియాగో మార్టిన్- లీమా రోజ్ మార్టిన్ కుమార్తె డైసీ మార్టిన్ ను అధవ్ అర్జున పెళ్లాడారు.
టీవీకే చీఫ్ విజయ్ 648 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు వెల్లడించారు.. అఫిడవిట్ లో. టీవీకే ప్రధాన కార్యదర్శి, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ అధవ్ అర్జున పేరు మీద 534 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. చెన్నై విల్లివాక్కం నుండి పోటీ చేశారు అధవ్. 17,000లకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మరో వ్యాపారవేత్త డాక్టర్ ఇసాకి సుబయ్య పేరు మీద రూ. 419 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఏఐఏడీఎంకే నుంచి గెలిచిన సంపన్న ఎమ్మెల్యేల్లో ఆయనా ఒకరు. తిరునెల్వేలి అంబసముద్రం నుండి గెలిచారు. డీఎంకేలో అత్యంత సంపన్న అభ్యర్థి కార్తీక్ మోహన్. ఆయనకు ఉన్న ఆస్తులు రూ. 346 కోట్లు. ఆయన విజయం సాధించలేకపోయారు. విల్లివాక్కం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆధవ్ అర్జున ఇక్కడి నుంచి గెలుపొందారు.












Click it and Unblock the Notifications